News

శ్రీపాద వల్లభుడికే రాఖీ కడతారు..

175views

రాఖీ పౌర్ణమి రోజున అందరి ఇళ్లలో ఒకటే సందడి. సోదరుల చేతికి అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం చూస్తుంటాం. కాకినాడ జిల్లాలో మాత్రం పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుని విగ్రహానికి రాఖీలు కట్టేందుకు భక్తులు పోటెత్తుతారు. అందులో సింహాభాగం మహారాష్ట్రకు చెందినవారే ఉంటారు. ఈ వేడుక ఇక్కడ ఉత్సవంలా జరుగుతుంది. ఈ ప్రదేశంలో దత్తాత్రేయస్వామి స్వయంభువుగా అవతరించారు.

పూర్వం శ్రీపాద శ్రీవల్లభుడికి సోదరిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టినట్లు చెబుతారు. అప్పటి నుంచి అమ్మవారిని కొలిచేవారుతో పాటు వల్లభుని భక్తులు ఏటా పిఠాపురంలోని శ్రీపాదుని మహాసంస్థానంలో విగ్రహానికి, ఔదంబర వృక్షానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే స్వామికి రక్ష సమర్పిస్తారో వారిని సోదరుడిగా శ్రీపాద వల్లభుడు భావిస్తాడని, చిత్రగుప్తుడు చేత వారి చేసిన పుణ్యంలో లెక్కిస్తారని భక్తుల నమ్మకం.

మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏటా 10 వేల మందికి పైగా ఈ ఆలయానికి వచ్చి రాఖీలు కట్టి పూజలు చేసి పారాయణాలు చదువుతారు. సాధారణంగా గుడికి వెళితే కొబ్బరి కాయలు కొడుతుంటారు. శ్రీవల్లభుని చెంతకు వచ్చేవారు మాత్రం కొబ్బరి కొట్టరు. కాయ పలంగా చెట్టుకు కట్టి మొక్కడం ఇక్కడ మరో విశేషం. ఇప్పటికే వారం నుంచి మహారాష్ట్ర భక్తుల రాక మొదలైంది. పిఠాపురంలోని హోటళ్లు, గదులన్నీ నిండిపోయాయి. వీరి కోసం దేవాదాయశాఖ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఆర్‌.సౌజన్య తెలిపారు.