News

కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

245views

కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలి. దీనికి క్షేత్రస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషించాలి’ అని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఎస్పీ మణికంఠ అన్నారు. ఆలయ ఈవో కార్యాలయ భవనం వద్ద ఉన్న సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో ఈవో పెంచలకిషోర్‌ అధ్యక్షత బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 21 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని కోరారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు, ఉభయదారులకు స్వామి దర్శనానికి ప్రత్యేక సమయం కేటాయిస్తామని చెప్పారు. అలాగే ప్రతి సామాన్య భక్తుడూ తమకు వీఐపీతో సమానమని, ఉద్యోగులు భక్తితో సేవ చేస్తే బాగుంటుందని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో విస్తృతంగా అన్నదానం చేయడానికి తగిన ఏర్పాట్లను చేస్తామన్నారు. ఆలయం వద్ద విద్యుత్‌ అసౌకర్యం కల్గకుండా ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిత్తూరు, తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలన్నారు. ప్రొటోకాల్‌ విధులకు తహసీల్దార్లు, డీటీలను నియమించుకోవాలని ఆర్డీవో శ్రీనివాసులుకు సూచనలిచ్చారు.

చిత్తూరు నుంచి కాణిపాకం వచ్చే రహదారిలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లు, నైపుణ్యం కలిగిన డాక్టర్లను నియమించాలని డీఎంహెచ్‌వో సుధారాణి, అడిషినల్‌ డీఎంహెవో వెంకటప్రసాద్‌కు ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉభయదారులు, భక్తులు సహకరించాలని కోరారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా 21 రోజుల పాటు తాను కూడా సామాన్య భక్తుడిలా స్వామి దర్శనానికి విచ్చేస్తానని ఎమ్మెల్యే మురళీమోహన్‌ తెలిపారు.