News

ఆపరేషన్‌ సిందూర్‌.. 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

170views

పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ను వణికించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంటులో వాడీవేడి చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. ‘‘మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పాయి. పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారు. మన సైనికులు ఏడు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్‌ పూర్తి చేశారు. సిందూర్‌ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన సైన్యానికి అభినందనలు. దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత.

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ సైన్యం మనపై దాడికి దిగింది. దాయాది దాడులను సమర్థంగా తిప్పికొట్టాం. మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌లోని మిసైల్‌ లాంఛింగ్‌ స్టేషన్‌ ధ్వంసమైంది. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసింది. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారు. ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చాం. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయి. సరిహద్దులు దాటి వెళ్లడం.. ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం కాదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే మా లక్ష్యం. యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే మా విధానం.

కాళ్ల బేరానికి వచ్చిన పాక్‌
మనం చేసిన దాడులతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. మన త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్‌ డీజీఎంవో వెంటనే మనకు ఫోన్‌ చేశారు. మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపిస్తోంది. భుజ్‌, ఉధంపూర్‌ స్థావరాలకు వెళ్లి మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశా. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నాం. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలి.

స్నేహ హస్తం.. భారత్‌ గొప్పతనం
1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి. ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయి. మన సైనికుల చర్యను వాజ్‌పేయీ ప్రశంసించారు. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్‌పేయీ లాహోర్‌ యాత్ర చేపట్టారు. పాకిస్థాన్‌తో భారత్‌ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్‌పేయీ చెప్పారు. స్నేహ హస్తం చాచడమే భారత్‌ గొప్పతనం. ఆనాడు వాజ్‌పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్‌ మర్నాడు సూర్యోదయం చూసేది కాదు. శాంతి కోరడం భారత్‌ రక్తంలోనే ఉంది. యుద్ధాలు కోరుకోం. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తాం. తుపాకులు పేలితే ఎవరూ మిగలరు.

చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్‌ అధికారులు పాల్గొన్నారు. దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు మనం ఎవరిపైనా దాడి చేయలేదు. పాకిస్థాన్‌ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకొని మాట్లాడాలి. మనిషి.. నీతి, నిజాయతీతో బతకాలని తులసీదాస్‌ దోహాలో చెప్పారు. భారత స్నేహహస్తాన్ని పాక్‌ అందుకోలేకపోయింది. మనదేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం.. ఆ దేశానికే ఇబ్బందిగా మారుతుంది’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.