
నిజమే, కెనడాలో గంగాహారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, భారత సంతతి వారు కలసి మిస్సిస్సాగా నదినే గంగానదిగా భావించి హారతి సమర్పించారు. టీమ్ ధిషమ్ అధ్వర్యంలో జూలై 8న జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ మూలాలు ఉన్నవారంతా సంప్రదాయక దుస్తులలో, శంఖాలు పూరిస్తూ హారతి పట్టారు.

టొరంటోలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ సంజీవ్ సకలానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. వేదమంత్రాలతో, శంఖారావాలతో ఆ సాయంత్రం ఎంతో ఆహ్లాదంగా కనిపించిందని ఆయన అన్నారు. విదేశాలలోని నదికి గంగాహారతి ఏమిటని కొందరు నిత్యశంకితులు యథావిధిగా సామాజిక మాధ్యమాలలో చొప్పదండి ప్రశ్నలు సంధించారు. అందుకు చక్కని సమాధానాలే వెళ్లాయి. నది ఏదీ అన్నది ముఖ్యం కాదు, ఇక్కడ భావనే ప్రధానం అని చెప్పారు చాలామంది. నిజానికి భారతదేశంలో నీటిని ఎక్కడైనా గంగ అనే గౌరవిస్తారు. కెనడాలో గంగాహారతి చేపట్టిన భారతీయుల భావన కూడా అదే అయి ఉంటుంది.





