NewsSeva

కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్రను సందర్శించిన ఉత్తర అమెరికా తెలుగు సమితి. ( నాటా)

480views

నాటా సంస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి బృందం డాక్టర్ రామిరెడ్డి డాక్టర్ నారాయణ రెడ్డి శ్రీమతి సుధారాణి డాక్టర్ కోటి రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ రెడ్డి గారితో కలిసి నంద్యాల సంఘమిత్రను సందర్శించడం జరిగింది.

సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ పాండే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఈ కార్యక్రమం సంయోజకులు  మరియు ముఖ్య అతిథి డాక్టర్ గోసల రాఘవ రెడ్డి  మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఉదాత్తంగా పనిచేయుచున్న సేవా సంస్థల ను ఎన్నుకొని సహాయం అందించుటకు 17 రోజులు పాటు నాలుగు వేల కిలోమీటర్ల ప్రయాణించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలియజేశారు. సాంస్కృతిక వికాసమే నాటా మాట అని, సమాజం సేవయే నాట బాట అని తెలియ జేశారు. ఇంత చక్కటి వాతావరణంలో  ఎక్కువ సేపు ఉండలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు.

చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ ” అన్నీ తామే అయి చూసుకుంటున్న ఇంత చక్కటి కమిటీ సంరక్షణలో వుండటం మీ అదృష్టం. మీ ప్రదర్శన,క్రమశిక్షణ, పరిశుభ్రత చూస్తే భవిష్యత్తులో మీరు ఎంతటి గొప్ప స్థానంలో ఉంటారో ఊహించుకోగలము.  మీ ప్రదర్శనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కష్టపడి గొప్పవారై మీలాంటి ఎందరికో ఆసరా కావాలి” అని పిలుపునిచ్చారు. ఇంతటి ఉదాత్తమైన సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం తప్పక ఉంటుందని తెలియ జేశారు.

నంద్యాల సంఘమిత్ర సంస్థాపకులు డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఈ సారి పూర్తి సమయం మాతో గడిపి ఇతర సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మేము ప్రధానంగా నిర్వహిస్తున్న నిరాశ్రిత బాలుర ఆవాసం,  దారిద్ర్య రేఖ దిగువన ఉన్న గ్రామీణ వ్యవసాయ దారుల పిల్లల విద్యార్థి ఆవాసం, 38 చెంచు గూడేలలో మొబైల్ డిస్పెన్సరీ సేవలు వ్యక్తిగతంగా పరిశీలించి ఇంకా మెరుగైన సేవలు అందించుటకు వారి అమూల్యమైన సలహాలు అందించవలసిందిగా కోరారు.

సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ ఖండాంతరాల లో ఉన్నా మాతృ భూమి పట్ల నాటా బృందానికి ఉన్న భక్తికి, ఆర్తుల పట్ల ఉన్న సేవా నిరతికి ధన్యవాదాలు  అర్పించారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ మనోహర్, కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్, వారి సతీమణి, కోశాధికారి శ్రీ నాగ రాజయ్య, వారి సతీమణి, సంఘటన కార్యదర్శి శ్రీమతి విజయ శ్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ వెంకటయ్య, మొబైల్ డిస్పెన్సరీ డాక్టర్ సూర్యారావు, శ్రీరామచంద్రుడు,  శ్రీ చాంద్ బాషా మరియు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి ఇతర సంఘమిత్ర ఆత్మీయ బంధువులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.