News

నివాస ప్రాంతాల్లో నామ సంకీర్తనకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు

229views

మద్రాసు హైకోర్టు అత్యంత సంచలన తీర్పునిచ్చింది. హిందువులు తమ ఇళ్లల్లో చేసుకునే భజన (నామ సంకీర్తన) చేసుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ముందస్తుగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం క్రోమ్ పేటలో జరుగుతున్న నామ సంకీర్తనను నిలిపేయాలని, జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి మంజూరు అయ్యే వరకు నిలిపేయాలని కూడా ఆదేశించింది.

జస్టిస్ ఆనంద్ వెంకటేష్ సారథ్యంలోని ఏకసభ్య బెంచ్ స్పందిస్తూ.. ‘‘జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా నివాస ప్రాంగణాల్లో మతపరమైన సమావేశాల్లో నామ సంకీర్తనను అనుమతించలేము’’ అని ప్రకటించారు.

చెంగల్పట్టు లోని క్రోమ్ పేట రాధా నగర్ లోని కృష్ణమాచారి వీధిలో వుండే ప్రకాష్ రామచంద్రన్ భజనపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. తన నివాసం పక్కనే వుండే సుబ్రమణియన్ అనే వ్యక్తి నివాస స్థలంలో ప్రతిరోజూ నామ సంకీర్తన చేసుకోవడానికి గ్లోబల్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ డివనిటీ (GOD) కి అనుమతించాడని, దీంతో ప్రతి రోజూ తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇదంతా జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండానే జరిగిపోతోందని పేర్కొన్నాడు.

దీంతో జస్టిస్ ఆనంద్ వెంకటేష్ స్పందిస్తూ ‘‘నివాస ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న నామ సంకీర్తన గురించి సుబ్రహ్మణియన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.ఇది ఆయనకు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే.. తనకు పొరుగువారి అనుమతి వుందని నిర్వాహకుడు వాదిస్తున్నాడు. కోర్టు దృష్టితో చూస్తే.. ఎప్పుడైతే నివాస ప్రాంగణాన్ని ప్రార్థన చేసే స్థలంగా చేయాలనుకుంటున్నారో అప్పుడు కలెక్టర్ అనుమతి అవసరం అని.’’ కోర్టు పేర్కొంది.

మరోవైపు ప్రైవేట్ ప్రతివాదుల తరపున న్యాయవాది స్పందిస్తూ.. అనుమతి కోరుతూ తాము జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు కూడా సమర్పించామని, అది పెండింగ్ లో వుందని కోర్టు దృష్టికి తెచ్చాడు. అయినా జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేయలేదన్న విషయం తెలిసిపోతోందని కోర్టు పేర్కొంది. అందుకే అనుమతి పొందే వరకు ప్రార్థనలు చేయవద్దని, ఒకవేళ చేయాల్సి వస్తే.. చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగించకుండా ఇంటి లోపలో చేసుకోవాలని కోర్టు పేర్కొంది.అంతేకాకుండా భారీ సంఖ్యలో భక్తులను ఈ నామ సంకీర్తనకు ఆహ్వానిస్తే.. వాహనాలు అధిక సంఖ్యలో వస్తాయని, ఇది కూడా ఇతరులకు ఇబ్బందే అని పేర్కొంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోర్టు సూచించింది.