News

శ్రీకాకుళంలో లోకమాన్య జయంతి వేడుకలు

201views

స్వరాజ్య కెరటం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి వేడుకలు బుధవారం శ్రీకాకుళం గాంధీ మందిరంలో వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన పోరాట యోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో గాంధీ మందిరంలో స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో తిలక్ 169వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ మందిర బృందం నటుకుల మోహన్, నిష్టల నరసింహమూర్తి, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ మందుల మోహన్రావు, నక్క శంకరరావు తదితరులు తిలక్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అతివాద భావాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కీర్తి తిలక్ సొంతమన్నారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించడంతోపాటు వినాయకచవితి, దుర్గామాత ఉత్సవాలను వాడవాడలా నిర్వహించడం ద్వారా భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన మహోన్నతుడు తిలక్ అని కొనియాడారు. భావితరాలు తిలక్ ను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం, ధర్మం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.