News

నిషేధిత PFI సభ్యులంతా SDPI లోకి : కీలక విషయం చెప్పిన కేరళ పోలీసులు

355views

నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’’-PFI కార్యకర్తల విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా ఇప్పుడు సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా-SDPI లో చేరుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్ ప్రకటించారు కూడా.

2022 లో పీఎఫ్ఐని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో దాని కార్యకర్తలు కొత్త బ్యానర్ ను వెతుక్కున్నారని, SDPIతో చర్చల తర్వాత అందులో చేరిపోయినట్లు పేర్కొన్నారు. ‘‘పీఎఫ్ఐని కేంద్రం నిషేధించిన తర్వాత.. కేరళతో సహా.. వివిధ రాష్ట్రాల్లో వున్న ఆ సంస్థ సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. వారందరు కూడా , SDPI లో ఇప్పుడు కలిసిపోయారు. ఈ పరిణామాన్ని మేము పసిగట్టాం. అలాంటిపై వారిపై కచ్చితంగా చర్యలుంటాయి’’ అని డీజీపీ ప్రకటించారు.

ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2022 లో పీఎఫ్ఐ ని నిషేధించింది. నిజానికి రాజకీయ పార్టీ ముసుగులో ఇది కార్యకలాపాలు నిర్వహించింది. కానీ.. పీఎఫ్ఐ కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని తేలింది. అలాగే ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం, శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చిందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.ఉపా చట్టం కింద పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ వుమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ రెహాబ్‌ కేరళ ఫౌండేషన్‌పై నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నది.

స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)కి చెందినవారే పీఎఫ్‌ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్‌ ఉల్‌ ముజాయిద్దీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ)తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. ఐఎస్‌ఐఎస్‌తోనూ లింకులు ఉన్నాయి. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయి అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పీఎఫ్‌ఐ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ సంస్థకు చెందిన సభ్యులు మతమార్పిడులు, ఉగ్రవాదం, మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాకుండా, నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. పీఎఫ్‌ఐ 2006 డిసెంబర్‌ 19న ఏర్పాటైంది. ఈ సంస్థకు విదేశీ విరాళాలు వస్తున్నట్టు ఎన్‌ఐఏ ఆరోపిస్తున్నది.మరోవైపు పీఎఫ్ఐని నిషేధించడాన్ని కర్నాటక హైకోర్టు కూడా సమర్థించింది.