News

విదేశాంగ విధానంలో మరింత వ్యూహాత్మక మార్పు : రామ్ మాధవ్

278views

భారత విదేశాంగ విధానంలో మరింత వ్యూహాత్మక మార్పు రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సదస్యులు, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ సూచించారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు వుండాలని అదే సమయంలో వాస్తవాలను ప్రతిబింబించని విషయాలపై కూడా హెచ్చరించారు. రామ్ మాధవ్ తాజాగా రచించిన The New World: 21st Century Global Order and India”, అనే పుస్తకంపై హైదరాబాదులో సమావేశం జరిగింది. దీనిని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్శిటీతో కలిసి ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ప్రతి దేశానికి కూడా అంతర్గతంగా సవాళ్లు వుంటాయని, వున్నాయని అన్నారు. అమెరికా, చైనా కు కూడా అంతర్గత సవాళ్లున్నాయని నొక్కి చెప్పారు. కానీ.. వారు అక్కడే ఆగిపోలేదని, తమ పాత్ర ఈ ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్దది అంటూ ఊహించుకుంటూ వెళ్తున్నారని, ఊహా శక్తితోనే ముందుకు సాగుతున్నారన్నారు. అదే వారికి మలుపు అయ్యిందన్నారు. భారత్ కూడా ఈ విధంగానే ముందుకు సాగాలని, ఆ సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

ఇక.. విదేశాంగ వ్యవహారాల్లో ఆచరణాత్మకమైన, వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తి విధానం వుండాలని సూచించారు. భారత్ కూడా అత్యంత వేగంగా నూతన విధానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇదో అవకాశమని అన్నారు. భారత్ తన అంతర్గత సమస్యలను అడ్డంకులుగా చూడొద్దని, వాటిని ఓ సవాళ్లగానే చూస్తూ.. ప్రపంచంతో నమ్మకంగా ముందుకు సాగాలని కోరారు.

1945తర్వాత ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, డాలర్ ఆధారిత కరెన్సీ వ్యవస్థ లాంటి బహూపాక్షిక సంస్థలు క్షీణిస్తూ వచ్చాయని అన్నారు. తాజాగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలు పరిష్కారం కాని గాజా వివాదం వరక సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వేదికలన్నీ విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఈ కొత్త పుస్తకం వచ్చిందని రామ్ మాధవ్ వివరించారు. గ్లోబల్ గవర్నెర్స్ విషయంలో పునరాలోచన జరిగాలని నొక్కి చెప్పారు. అలాగే కొత్తగా భారత్ అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని కూడా రామ్ మాధవ్ ఈ సందర్భంగా వివరిస్తూ హైలెట్ చేశారు.

ఈ సందర్భంగా రామ్ మాధవ్ అరబిందో మహర్షి తాత్వికతను ఉటంకించారు. ధర్మం ఆధారంగా పాలన సాగాలన్నారు. (ధర్మోక్రసీ). అహింస, ఆధ్యాత్మికత, ప్రజల కేంద్రంగా వుండే ప్రజాస్వామ్యం వీటి మూలాలని, ఈ దార్శనికత వుండాలని రామ్ మాధవ్ సూచించారు.

వాస్తవాలను ప్రతిబింబించని స్థితిని అడ్డుతొలగించుకొని,మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వుండే ఆచరణవాదం వైపు అడుగులు పడాలన్నారు. ప్రస్తుతం విదేశాంగ విధానంలో భారత్ అనుసరిస్తున్న పథం పరిణతి చెందిన మార్గమని ప్రశంసించారు. ‘‘మీతో మేమున్నాం.. మేము కూడా మీతో వున్నాం’’ అన్న సమతౌల్య విధానాన్ని ప్రస్తావిస్తూ ఇది పరివర్తన కోసం రూపొందించిన ఆచరణాత్మక విదేశాంగ విధానం అని అన్నారు.

ఇక AI సాంకేతికతపై కూడా రామ్ మాధవ్ స్పందించారు. ప్రపంచంలో ఇదో పరివర్తన శక్తి అని, సవాలు కూడా అని అన్నారు.సంప్రదాయ వాణిజ్య నమూనా, సాంకేతికత కంటే పరిశోధన, అభివృద్ధిలో మరింత పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. భారత్ తన జీడీలో కేవలం 1 శాతం మాత్రమే పరిశోధన – అభివృద్ధిలో పెట్టుబడి పెడుతోందని అదే చైనాలో 6.5 శాతం, అమెరికా కూడా ఇది 4శాతమేనని వివరించారు. భవిష్యత్తులో భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే మాత్రం వ్యూహాత్మక మార్పు కచ్చితంగా రావాల్సిందేనని రామ్ మాధవ్ నొక్కి చెప్పారు.