
ప్రభుత్వం కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాల విముక్తి విషయంలో విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మహారాష్ట్రలోని జలగావ్ కేంద్రంగా VHP జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం నుంచి హిందూ దేవాలయాలను విముక్తం చేయడం, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులను కాపాడుకోవాలంటూ రెండు ముఖ్య తీర్మానాలను ఇందులో ప్రవేశపెట్టారు. ఇవి ఆమోదం కూడా పొందాయి. ఈ విషయాన్ని VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో వుండుకూడదన్న దృఢ సంకల్పాన్ని హిందూ సమాజం తీసుకుందని, దాని దిశగానే కార్యాచరణ కూడా వుంటుందని ప్రకటించారు. ఇందుకోసం సెప్టెంబర్ మాసంలో 7 నుంచి 21 వ తేదీ వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులందర్నీ కలిసి, ఓ వినతి పత్రాన్ని సమర్పిస్తామని ప్రకటించారు. అలాగే దేశంలోని అన్ని మహా నగరాల్లో విద్యావంతులతో గోష్ఠులు, సమావేశాలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇక రెండో దశలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కలుసుకుంటామని, విషయాన్ని వివరిస్తామని తెలిపారు. వారి ద్వారా అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా తమ కార్యాచరణ వుంటుందని అలోక్ కుమార్ ప్రకటించారు.
విచ్ఛిన్నకర శక్తులపై పోరాటం…
ఈ అంతర్జాతీయ సమావేశాల్లో మరో అంశంపై కూడా విశ్వహిందూ పరిషత్ నేతలు తీర్మానం చేశారు. భాష, ప్రాంతం, ఇతరత్రాల ఆధారంగా హిందూ సమాజాన్ని విఛ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిని అడ్డుకుంటామని ప్రకటించారు. ఈ విభజనవాదులకు వ్యతిరేకంగా ఓ తీర్మానం కూడా చేశారు. హిందూ సమాజం ఐక్యంగా వుంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని అన్నారు. అందరూ ఐక్యంగా వుండాలని, సంఘటితంగా వుండాలని తాము మరోమారు హిందూ సమాజానికి పిలుపునిస్తున్నామని తెలిపారు.
పీడీఏ, మీమ్ -భీమ్, ఆర్య ద్రావిడ, మహిషాసుర -దుర్గ, భాషా-కులం- ప్రాంతం, ఓఆర్పీ ఈ అంశాల ఆధారంగా విచ్ఛిన్నకర శక్తులు హిందూ సమాజంలో చీలకలు తేవడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ‘‘హైందవ: సోదరా సర్వే, నహిందూ పతితో భవేత్’’ అని 1969 లోనే హిందూ సమాజం ప్రతిజ్ఞ చేసిందని గుర్తు చేశారు. హిందూ సమాజంలో తక్కువ, ఎక్కువ అన్న తేడాలే లేవని, కుట్రవాదులు దీనిని రేపుతున్నారని మండిపడ్డారు.
అలాగే ముఖ్యంగా విధ్వంసకర శక్తులు, విస్తరణవాదులు, చర్చి, రాడికల్ ఇస్లాం, మార్క్సిజం, లౌకికవాదం, మార్కెట్ శక్తులు అన్నీ కూడబలుక్కొన్ని, విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వీరందరూ హిందూ మతాన్నే లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘాటించారు. వీరికి తోడు విదేశీ నిధులతో నడిచే సంస్థలు, ప్రగతిశీల సంస్థలు, మత మార్పిడి శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయని, వారి అంతిమ లక్ష్యం హిందూ సమాజ విచ్ఛిన్నమే అని, హిందూ మూలాలపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు. వారి కుట్రలను ఛేదిస్తామని అలోక్ కుమార్ ప్రకటించారు.





