News

2 లక్షల మొక్కలు నాటిన ‘ట్రీ మ్యాన్‌’

423views

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన విజయ్‌ జెనా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత 24 ఏళ్లలో ఏకంగా 2 లక్షలకు పైగా మొక్కలను నాటారు. భువనేశ్వర్‌లో ఆదాయపుపన్ను శాఖ తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్‌ 2001లో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఈయన సంకల్పానికి కుటుంబం కూడా అండగా నిలుస్తోంది. సొంత డబ్బుతో నర్సరీలో మొక్కలు పెంచుతూ, వాటిని పలు ప్రదేశాల్లో విజయ్‌ నాటుతున్నారు.

బాలేశ్వర్‌తోపాటు భువనేశ్వర్‌ పరిసరాల్లోనూ రోడ్ల పక్కన, ప్రభుత్వ భూముల్లో, బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్న విజయ్‌ను అందరూ ‘ట్రీ మ్యాన్‌’ అని పిలుస్తారు. మొక్కలు నాటేందుకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో పార, గునపం, కొన్ని మొక్కలు, చిన్న నీటిట్యాంకు ఉంటాయి. నాటిన మొక్కలను పశువులు తినేయకుండా కంచె కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా గత రెండు దశాబ్దాల్లో విజయ్‌ నాటిన మొక్కలు కొన్ని ఇప్పుడు మహావృక్షాలుగా ఎదిగాయి. ఈయన మొక్కలు నాటిన అన్ని ప్రదేశాలను సర్వే చేసిన ఒడిశా అటవీశాఖ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. విజయ్‌ కృషిని చూసి మిత్రులు, కొన్ని సంస్థలవారు ఆర్థికంగా మద్దతునిస్తున్నారు.