
మేఘాలయాలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని మౌసిన్రామ్ ప్రాంతంలోని పవిత్రమైన మౌజింబుయిన్ గుహకు తీర్థయాత్ర నిర్వహించడానికి శాంతి భధ్రతలు, స్థానిక మనోభావాలను గౌరవించేలా షరతులతో కూడిన యాత్రను చేసుకోవచ్చంటూ మేఘాలయ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
పరమ పవిత్రంగా భావించే మౌజింబుయిన్ గుహకు వెళ్లడానికి తీర్థయాత్రను సులభతరం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హెచ్.ఎస్. థాంగ్ఖీవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సామరస్యపూర్వకమైన, గౌరవప్రదమైన యాత్ర లేదా తీర్థయాత్రకు వీలు కల్పించడానికి కొన్ని భద్రతా చర్యలపై పాల్గొన్న అన్ని పక్షాలు అంగీకరించాయి.
కోర్టు ఆదేశాల ప్రకారం, యాత్రికులు గుహ వద్ద ఎటువంటి పూజలు లేదా మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి లేదా అలాంటి ఆచారాల కోసం ఉద్దేశించిన వస్తువులను తీసుకురావడానికి అనుమతించబడరు.
గుహ లోపల ఉన్న సహజంగా ఏర్పడిన పవిత్ర శివలింగం పై కేవలం కొన్ని నీటిని మాత్రమే అభిషేకించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది, ఎక్కువగా నీరు పోయడానికి కూడా అనుమతి లేదని స్పష్టంగా కోర్టు చెప్పింది.. యాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగేలా జిల్లా అధికారులను పర్యవేక్షించాలని ఆదేశించింది. అదనంగా, ట్రాఫిక్ వార్డెన్లుగా సహాయం చేయడానికి ప్రజల ప్రవాహాన్ని నిర్వహించడానికి ప్రైవేట్ భద్రతా సిబ్బంది లేదా స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని నిర్వాహకులకు సూచించింది. అంతేకాకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా, యాత్రా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కోర్టు మరీమరీ చెప్పింది.
అసలేంటీ మౌజింబుయిన్ గుహ
మావ్జింబుయిన్ గుహ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, ఇది 209 మీటర్ల ఎత్తులో ఉండి సున్నపు ఇసుకరాళ్ళతో రూపొందించబడింది. ఇక్కడ సహజసిద్ధంగా శివలింగం ఏర్పడుతుంది. వాతావరణ ప్రభావం, కాల్షియం కార్బోనేట్ నిక్షేపణ ఖనిజాలతో సమృద్ధమైన ద్రవం చినుకులు పడటం వలన శివలింగం ఏర్పడుతుంది . ఇది వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని స్థానికులు నమ్ముతారు. శ్రావణ మాసంలో, కన్వర్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ యాత్రికులు గుహను సందర్శిస్తారు. యాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు కాషాయ దుస్తులు ధరించి చెప్పులు లేకుండా గుహ వద్దకు చేరుకుని శివలింగానికి పూజలు చేస్తారు. మహాశివరాత్రి సమయంలో కూడా హిందూ భక్తులు కూడా ఈ గుహను సందర్శిస్తారు. అయితే ఈ గుహను సందర్శించడంపై పలు ఆంక్షలున్నాయి. ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి హిందువులకు వీలులేదు.
గతంలో ఏం జరిగిందంటే…
అయితే మేఘాలయ ప్రభుత్వంలోని చర్చిలు , కొందరు మంత్రుల చురుకైన మద్దతుతో, దోర్బార్ ష్నోంగ్ (గుహకు యజమాని అని చెప్పుకునే సంస్థ) ఆగస్టు 2024లో మావ్జింబుయిన్ గుహలో హిందూ ఆరాధనను మొదట నిషేధించింది. దోర్బార్ ష్నోంగ్ కార్యనిర్వాహక కమిటీ గుహలో ప్రార్థనా స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఏ సమూహాన్ని అనుమతించబోమని ప్రకటించింది. హిందూ యాత్రా తీర్థయాత్ర బృందం 2024 ఆగస్టు 10 , 11 తేదీలలో ఆ స్థలాన్ని పూజ కోసం ఉపయోగించుకోవాలని ప్రకటించిన తర్వాత వారు ఈ నిర్ణయాన్ని చెప్పారు. ఆ సమయంలో, ఈప్రకటన మేఘాలయలోనే కాకుండా అస్సాంలో కూడా హిందూ సంఘాల నిరసనలకు దారితీసింది. నిషేధాన్ని ఎత్తివేయకపోతే అస్సాం నుండి మేఘాలయకు వెళ్లే రహదారులను దిగ్బంధిస్తామని అస్సాంకు చెందిన హిందూ సంస్థ కుటుంబ సురక్ష పరిషత్ (KSP) బెదిరించింది.
ఆసమయంలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా దోర్బార్ ష్నోంగ్ ప్రకటనను సమర్థిస్తూ పవిత్ర గుహలో హిందూ పూజలపై నిషేధాన్ని ఆమోదించింది. పర్యాటక మంత్రి పాల్ లింగ్డోహ్ మాట్లాడుతూ, “ఈ నిర్ణయం తార్కికం, సహేతుకమైనది ఎందుకంటే ఈ గుహ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఒక నిర్దిష్ట మతాన్ని ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకానికి హాని కలుగుతుంది” అని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఈ యాత్ర చేయడానికి ఇచ్చింది. ఇక ఈ విషయం జూలై 31న తదుపరి విచారణ చేపట్టనుంది, ఆ సమయానికి ఇరు వర్గాలు యాత్ర ఖచ్చితమైన తేదీని నిర్ణయించి జిల్లా అధికారులకు తెలియజేయాలి





