
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (ఆగ్రహం వ్యక్తంచేశారు. పాక్ దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాలు విసిరారు. చైన్నైలోని ఓ కార్యక్రమానికి హాజరైన డోభాల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలను ఎలా ధ్వంసం చేసిందనే విషయాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించి దాయాదికి ముచ్చెమటలు పట్టించామని అన్నారు.
సోషల్ మీడియాలో విదేశీ వార్తాసంస్థలు ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలను డోభాల్ కొట్టిపడేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది.. ఇది చేసిందంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసిందని మండిపడ్డారు. ఆ దేశంలో ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అత్యంత కచ్చితమైన సమాచారంతోనే భారత సైన్యం దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్థాన్‌లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ.. భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదని వ్యాఖ్యానించారు. భారత్‌కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్నగీత కూడా పడనివ్వలేదని అన్నారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధన సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తోందని డోభాల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయన్నారు. పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు… గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే సమర్థమంతంగా పేల్చివేశాయని తెలిపారు.





