
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాలీ గడ్డ పైనే పుట్టాడని అన్నారు. రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రామాయణంలోనే ఉందని చెప్పారు. ఖాట్మండులో సీపీఎన్-యూఎంఎల్ పర్యాటక, పౌర విమానయాన శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వాల్మీకి రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని, ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించాల్సి పని లేదని అన్నారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా స్పష్టించగలరని ఓలి ప్రశ్నించారు. రాముడు పుట్టింది ఇక్కడే, ఆయన పుట్టిన స్థలం కూడా ఇక్కడే ఉందని చెప్పారు. రాముడు ఎందరికో దైవం అయినప్పటికీ దీనిని నేపాల్ చురుకుగా ప్రచారం చేయలేకపోయిందని అన్నారు. ‘దీనిపై మాట్లాడేందుకు మనం సంకోచించాం. తగినంతగా ప్రచారం చేయలేకపోయాం. ఏదేమైనా రాముడిని ఆరాధించే వారికి ఆయన పుట్టిన స్థలం చాలా పవిత్రమైనది’ అని నేపాల్ ప్రధాని అన్నారు. హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్రామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని ఆయన చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.





