Gallery

పాకిస్థాన్‌లో వ్యాపారం.. పైసా కూడా తిరిగిరాదు.. ఇది మాత్రం పక్కా..

233views

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఆర్థికంగా పాకిస్థాన్‌ చాలా మెరుగ్గా ఉండేది. అదే సమయంలో కొరియా యుద్ధం కూడా ప్రారంభం కావడంతో అమెరికా అవసరాల రీత్యా పాక్‌, తుర్కియేల్లో పశ్చిమ దేశాల కంపెనీలను ఏర్పాటు చేలా ప్రోత్సహించింది. కానీ, కాలం గడిచే కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. సైన్యం పెత్తనం పెరగడం, బోర్డుల్లోకి పాక్‌ ప్రభుత్వ మనుషులు చేరడం వంటివి పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడున్న ఎంఎన్‌సీలు (బహుళజాతి సంస్థలు) పెట్టేబేడా సర్దుకొని ఆ దేశం నుంచి పారిపోతున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన పాతికేళ్ల ప్రయాణాన్ని ఆపేసి.. ఆ దేశం నుంచి నిష్క్రమించింది. దీంతో మరోసారి పాక్‌ నుంచి భారీ సంస్థల వలసలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గణాంకాలను పరిశీలిస్తే.. విదేశీ కంపెనీలు కాదు.. స్వదేశీ సంస్థలు మెల్లగా యూఏఈ వంటి దేశాలకు తరలిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, కమ్యూనిస్టు చైనాతో ఎప్పుడూ అంటకాగే పాక్‌ పరిస్థితి ఇలా ఎందుకు దిగజారింది..?

గత కొన్నేళ్లలో టోటల్‌ ఎనర్జీస్‌, టెలినార్‌, షెల్‌ ఆయిల్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఆస్తులను తెగనమ్ముకొని ఇస్లామాబాద్‌కు బైబై చెప్పాయి. 2023 సంవత్సరానికి దుబాయ్‌లో 8,036 పాకిస్థానీ కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయని డాన్‌పత్రిక పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సంపాదించినా.. ఇంటికి తీసుకెళ్లలేం..?
పాకిస్థాన్‌లో ప్రభుత్వ నియంత్రణ విధానాలు ఊహకు అందవు. అనిశ్చితి, అస్థిర వాతావరణంతో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తారు. ఇక లాభాలను స్వదేశాలకు తరలించడం కూడా పెద్ద సమస్యే. టెలినార్‌ మాజీ సీఈవో సిగ్విబ్రెక్కె గతంలో పాక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక దేశం నుంచి ఇన్వెస్టర్ల లాభాలు వెనక్కి తీసుకెళ్లలేకపోతే.. అతడు కొన్నాళ్లకు ఆ దేశాన్ని వీడతాడు’’ అని పేర్కొన్నారు. ఇక పాక్‌లో 1-2 బిలియన్‌ డాలర్లు సంపాదించిన ఎంఎన్‌సీలు కూడా తమ సొమ్ము ఏళ్ల తరబడి పాకిస్థానీ బ్యాంకుల్లోనే ఉంచాల్సిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. లాభాలను సాధారణంగా డాలర్లలోకి మార్చే తరలించాలి. కానీ, పాక్‌లో విదేశీ మారక ద్రవ్యం కొరత దీనికి అడ్డం పడుతుంది.

భారీ వడ్డీ రేట్లు.. పన్ను బాదుడు..
ఇక పాక్‌లో పన్ను బాదుడు మామూలుగా ఉండదు. కార్పొరేట్‌ లాభాలపై 10శాతం సూపర్‌ ట్యాక్‌ అదనంగా సమర్పించుకోవాలి. ఇక వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి. ప్రస్తుతం 11శాతం ఉండగా.. దాదాపు ఏడాదిన్నర క్రితం అది 23శాతం. దీనికి తోడు విదేశీ మారకద్రవ్యం కొరత ఇన్వెస్టర్లను భయపెడుతూనే ఉంటుంది. బయట నుంచి ఏమైనా విడిభాగాలు దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లను భారీ రేటుకు మొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలదన్నట్లు బ్యూరోక్రసీ నుంచి అనుమతులు చాలా నిదానంగా లభిస్తాయి.

రాజకీయ అస్థిరత..
ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి రాజకీయ సుస్థిరత అవసరం. కానీ, పాకిస్థాన్‌ చరిత్రలోనే ఐదేళ్లు పాలించిన ప్రధాని లేరు. ఎవరైనా నాయకుడు బలపడుతుంటే తక్షణమే సైన్యం తిరుగుబాటు చేయడమో.. పరోక్షంగా పాలన పగ్గాలను లాక్కోవడమో చేస్తుంది. 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను బలవంతంగా పదవి నుంచి దింపివేయడం ప్రపంచం మొత్తానికి ప్రతికూల సంకేతాలు పంపింది. తరచూ ఈ దేశంలో సంపన్న కుటుంబాల మధ్య రాజకీయ పోరుతో విధానపరంగా స్థిరమైన నిర్ణయాలు వెలువడటం సమస్యగా మారింది.

ఇక న్యాయవ్యవస్థ కూడా రాజకీయ కేసులపై చూపినంత ఆసక్తి.. ఆర్థిక సంస్కరణలను పట్టించుకోదనే పేరుంది. విదేశీ పెట్టుబడులకు సంబంధించినవి.. ఆర్థిక అంశాలకు తక్కువ ప్రాధాన్యం లభిస్తుంది.

బ్యూరోక్రాట్‌ తిమింగలాలు..
పాకిస్థాన్‌లో స్టీల్‌ మిల్స్‌, కెమికల్‌ ప్లాంట్లు, డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు, బీమా కంపెనీల్లో బ్యూరోక్రాట్లు కీలక స్థానాల్లో ఉంటారు. విదేశీ ఎంఎన్‌సీలు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టినా.. స్వార్థం కోసం వాటిని వేటాడుతారనే పేరుంది.

ఇంటర్నెట్‌లో సమస్యలు..
పాక్‌లోని టెక్‌ కంపెనీలకు ఇంటర్నెట్‌సేవలు ఓ పెద్ద సమస్యగా మారాయి. దేశంలో వివాదాస్పదమైన ఫైర్‌వాల్‌ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చాలా నిదానంగా డేటా బదిలీ కావడం.. కొన్ని సార్లు సిస్టమ్స్‌ మొరాయించడం సహజంగా మారిపోయింది. పాక్‌ బిజినెస్‌ కౌన్సిల్‌, పాక్‌ సాఫ్ట్‌వేర్‌ హౌస్‌ అసోసియేషన్‌ (పీఎస్‌హెచ్‌ఏ) ఇప్పటికే పాలకులను ఈ అంశంపై హెచ్చరించాయి. తరచూ ఫైర్‌వాల్‌లో తలెత్తే సమస్యలతో చాలా కంపెనీలు దేశాన్ని వీడాలనుకుంటున్నాయని వెల్లడించాయి. నేషనల్‌ ఫైర్‌వాల్‌ కారణంగా నెలకు 300 మిలియన్‌ డాలర్లు అంతకు మించి నష్టం వాటిల్లుతుందని పీఎస్‌హెచ్‌ఏ పేర్కొంది.

పాక్‌లో ఇబ్బందులు తట్టుకోలేక ఉబర్‌, ఫైజర్‌, షెల్‌, ఎలీ ఇల్లీ, సనోఫి, టెలినార్‌, లొట్టోకెమికల్స్‌ పాక్‌లోని తమ ఆస్తులను స్థానిక కంపెనీలకు అమ్ముకొని వెళ్లిపోయాయి. తాజాగా ఆ జాబితాలోకి మైక్రోసాఫ్ట్‌ కూడా చేరింది.