News

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా చొప్పించారు

244views

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింకను చొప్పించినట్లు సీసీ కెమెరా పుటేజీల పరిశీలనలో తేలిందని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషర్‌కు సమగ్ర నివేదిక పంపారు. తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఉన్నట్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన కె.శరస్‌ చంద్ర లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రచార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ వ్యక్తి లడ్డూ కొనుగోలు చేసిన 6వ కౌంటర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఇందులో ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలింది. లడ్డూలు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ కౌంటర్‌ దగ్గరకు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఒక కవర్‌ ఇచ్చారు. ఆ తర్వాత సదరు వ్యక్తి మరో ముగ్గురితో కలిసి కౌంటర్‌ దగ్గర తాను కొన్న లడ్డూలో బొద్దింక ఉందని వాగ్వాదానికి దిగారు. ఆ వ్యక్తి తన ఫిర్యాదులో లడ్డూలో బొద్దింక ఉందని పేర్కొన్నారు. అధికారుల పరిశీలనలో అది మిడతగా తేలింది. ఈ అంశాలన్నీ పరిశీలించగా ఫిర్యాదుదారు అతనితో పాటు ఉన్న వ్యక్తులు దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు. ఈ మొత్తం ఉదంతంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఈవో ఎం.శ్రీనివాసరావు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.