News

భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న మునీర్‌..!

251views

భారత్‌ అకారణంగా రెండు సార్లు పాకిస్థాన్‌పై దాడికి పాల్పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ నోరుపారేసుకున్నారు. న్యూదిల్లీకి వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు. మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

కరాచీలోని నేవల్‌ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమంలో మునీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్థాన్‌ కాపడుతోందని పేర్కొన్నారు. భారత్‌ దుందుడుకు తనానికి పాక్‌ బలంగా స్పందించిందన్నారు. తమ దేశం ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పరిపక్వంగా స్పందించిందన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్‌ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని వింత వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు కూడా మునీర్‌ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. శుక్రవారం ఆర్మీ ఆఫీసర్స్‌ కామన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ భారత్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. న్యూదిల్లీ నెట్‌వర్క్‌కు అఫ్గానిస్థాన్‌ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడుతోందన్నారు. ‘అఫ్గానిస్థాన్‌తో పాక్‌ స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్‌ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నామన్నారు.

వాస్తవానికి పహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌ పాక్‌కు జీవనాడి అంటూ మునీర్‌ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే బైసరన్‌ వ్యాలీలో ఉగ్రమూక పర్యాటకుల ప్రాణలను తీసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి. వీటిల్లో పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ కూడా ఉంది.