
విజయనగరం జిల్లావ్యాప్తంగా శుక్రవారం రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర సాగింది. అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. శుక్రవారం పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆలయంలో పూజలు అయ్యాక స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై వేంచేయించారు. జిల్లా కేంద్రంలో దంగడి వీధిలోని ప్రధాన ఆలయం వద్ద స్వామివారికి విశేష పూజలు చేశారు. పట్టణవాసులు జగన్నాథుడిని దర్శించుకుని పులకించిపోయారు. అనంతరం పాతబస్టాండ్ కూడలి వద్ద నుంచి గుడించా మందిరం వరకు జగన్నాథ రథోత్సవం కనుల పండువగా సాగింది. జై జగన్నాథ్ అంటూ భక్తులు రథం వెంట నడిచారు. గుడించా మందిరంలో వచ్చే నెల 5వ తేదీ వరకు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఈవో ప్రసాద్ తెలిపారు. ఈనెల 1న హీరాపంచమిని పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. మారురథ యాత్ర రోజున జగన్నాథ స్వామిని తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భక్తు లు పూజలు చేశారు. రథయాత్రలో పాల్గొని జై జగన్నాథ.. నామ స్మరణతో రథాన్ని ముందుకు లాగారు. శ్రీకాకుళంలోని బొందిలీ పురం సదావర్తి పలహారి తఖియా ముల్క్‌దాస్ ఆధ్వర్యంలో బల భద్ర, సుభత్ర సమేత జగన్నాథస్వామిని ఇలిసిపురంలోని గుండి చా మందిరానికి రథయాత్రపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. శనివారం జగన్నాథస్వామిని మత్స్యావతారంలో అలంకరించను న్నామని అర్చకులు సుభద్ర పండా, బాలు పండా తెలిపారు. అలాగే గుజరాతిపేటలో లక్ష్యేశ్వర ఆలయం వద్ద రథయాత్రలో కూడా అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొండేటివారి వీధి, పాండురంగవారి వీధిలో జగన్నాథ స్వామిని రథంలో ఊరేగించి గుడించా మందిరానికి చేర్చారు. తొమ్మిది రోజులపాటు జగన్నాథు డు పూజలు అందుకోనున్నారని అర్చకులు తెలిపారు.





