News

ప్రపంచం ధర్మాన్ని మరచిపోయినప్పుడు గుర్తు చేయడం మన కర్తవ్యం

522views

తమిళనాడులోని ఆధీనాలు (హిందూ ఆధ్యాత్మిక పీఠాలు) హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడుతున్నాయని ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్. కోయంబత్తూరులోని తవతిరు శాంతలింగ అడిగళార్ ఆర్ట్స్, సైన్స్ అండ్ తమిళ్ కళాశాలలో జరిగిన సంఘ శతాబ్ది ఉత్సవాలకు, పేరూర్ అధీన శాంతలింగ రామస్వామి అడిగళార్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అధీన ఉత్సవాలతో పాటుగా, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఏకకాలంలో నిర్వహించినందుకు వారికి భాగవత్ కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగా అధీనములు, ఇతర ఆధ్యాత్మిక సాధువులతో కలిసి భాగవత్ శివ యాగంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ “హిందూ మతం కేవలం ఒక మతం కాదు, జీవన విధానం. నేటి అస్థిర ప్రపంచ వాతావరణంలో, హిందూ విలువలు శాంతి సామరస్యం వైపు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గమనీ, నిజమైన ఆనందం బాహ్య ప్రపంచం నుండి కాదు, అంత: ప్రపంచం నుండి వస్తుంది” అని అన్నారు. ఇంకా, ప్రపంచం ధర్మాన్ని మరచిపోయినప్పుడల్లా, దానిని గుర్తు చేయడం మన కర్తవ్యం అని, మనం ధర్మాన్ని ఆంగ్లంలోకి అనువదించి మతం అని పిలవకూడదని ఆయన అన్నారు. విదేశీ భాషలలో ధర్మానికి సమానమైన పదం లేదు, కానీ ధర్మం అనే భావన అన్ని భారతీయ భాషలలో అర్థాన్ని కలిగి ఉందని భాగవత్ జోడించారు.

“మన పిల్లలు మాతృభాషను నేర్చుకోవాలి. మనం మన భాషను కోల్పోతే మన సంప్రదాయాన్ని దానితో వచ్చే ప్రతిదాన్ని కోల్పోతాము. కొన్ని విషయాలను కాపాడుకోవాలి, కొన్ని ఆలోచనలు పాతవిగా మారవచ్చు, వాటిని తొలగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మన ప్రధాన విలువలను కాపాడుకోవాలి. మన దేశాన్ని మనం సంపన్నంగా మార్చుకోవాలి. అలా చేయడానికి, మనం స్వావలంబన కలిగి ఉండాలి. స్వతంత్ర దేశం అయినప్పటికీ కూడా క్రమశిక్షణ కలిగిన దేశంగా ఉండాలి” అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా అధీనములు ఇతర ప్రముఖులతో పాటు భాగవత్‌ను రాజకీయ ప్రముఖులు సత్కరించారు. ఎఐఎడిఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పార్టీ నేత కె అన్నామలై, పార్టీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్పీ వేలుమణి, ఆయన సోదరుడు అన్బరసన్ ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ భాగవత్‌కు వెండి వేల్‌తో పాటు మురుగన్ విగ్రహాన్ని బహుకరించారు.