
భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం.. భక్తుల సౌకర్యార్థం మరో డిజిటల్ సేవను తీసుకొచ్చింది. ఫెడరల్ బ్యాంక్ సౌజన్యంతో భక్తులు అతి సులభంగా దర్శన, సేవలు, ప్రసాద టికెట్ల టోకెన్లు తీసుకోవడానికి ఆలయంలో మూడు చోట్ల కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎల్ రమాదేవి ప్రారంభించారు.
ఈవో రమాదేవి మాట్లాడుతూ.. ‘‘భక్తులు కౌంటర్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ఈ యంత్రం ద్వారా టికెట్లను తీసుకునే వెసులుబాటు కల్పించాం. ఇందులోనే విరాళాలను సమర్పించే సదుపాయం పొందుపరిచాం. భక్తులు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమకు కావాల్సిన టిక్కెట్లను (సేవలను) ఎంపిక చేసుకొని డిజిటల్ చెల్లింపులు చెయొచ్చు. ముందుగా మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నాం. యంత్రం ద్వారా తీసుకున్న టికెట్‌ను చూపించి క్యూ లైన్‌లో దర్శనాలకు వెళ్లొచ్చు. ప్రసాద అన్నదాన కౌంటర్లలో వెళ్లి నేరుగా ప్రసాదాలు తీసుకోవచ్చు’’ అని ఈవో తెలిపారు. కియోస్క్ మిషన్ల ప్రారంభ కార్యక్రమంలో ఫెడరల్ బ్యాంక్ రీజినల్ హెడ్ జయప్రకాశ్, ఆలయ ఈఈ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.





