ArticlesNews

ఆదియోగి పతంజలి

297views

మన తత్వగ్రంథాల్లో పతంజలి అక్షరబద్ధం చేసిన ‘యోగసూత్రాలు’ భగవద్గీతతో సమానమైన ఖ్యాతిని పొందాయి. యోగ పితామహుడిగా ప్రసిద్ధుడైన ఆయనను ఆదిశేషుడి అవతారంగా భావిస్తారు. ఆ మునీశ్వరుడు యోగసూత్రాలతో పాటు ఆయుర్వేద వైద్య గ్రంథం రచించాడు. పాణిని వ్యాకరణానికి భాష్యాన్ని వెలువరించాడు. జూన్‌ 21 ‘యోగా దినోత్సవం’ సందర్భంగా ఆదియోగి పతంజలి మహర్షిని స్మరించుకుందాం.

శ్రీమహావిష్ణువు అనుచర గణంలో ముఖ్యుడు ఆయన శయనించే ఆదిశేషుడు. స్వామి ఎప్పుడు అవతారం దాల్చినా ఆ సేవకుడు ఆయనను అనుసరించి వస్తాడు. త్రేతాయుగంలో లక్ష్మణస్వామి, ద్వాపరయుగంలో బలరాముడు ఆదిశేషుడి రూపాలేనని, మానవాళికి మార్గనిర్దేశం చేసేందుకు కలియుగంలో పతంజలి మహర్షిగా అవతరించాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి.
పౌరాణిక కథను అనుసరించి- ఇప్పటి కాశ్మీర ప్రాంతంలో గోవర్ధమనే గ్రామం ఉండేది. అక్కడ గోణిక అనే శివభక్తురాలు పరమేశ్వరుణ్ణే భర్తగా భావిస్తూ కన్యగా ఉండిపోయింది. ఒకరోజు ఆమె సూర్యభగవానుడికి సరస్సులోని నీటిని దోసిళ్లతో సమర్పించింది. సద్గుణవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని భారతంలో కుంతీదేవిలా ప్రార్థించింది. సూర్యుడి సంకల్పంతో వైకుంఠంలోని ఆదిశేషుడి అంశ ఆ జలంలో ప్రవేశించింది. క్షణాల్లోనే యోగిరూపంలో ఉన్న బాలుడు గోణిక ముందు ప్రత్యక్షమయ్యాడు. సాధకురాలైన ఆమె దివ్యదృష్టితో విషయాన్ని అర్థం చేసుకుంది. భగవంతుడు ప్రసాదించిన పుత్రుణ్ణి అపురూపంగా పెంచుకోసాగింది. మహిమాన్వితుడైన ఆ బాలుణ్ణి అందరూ గౌరవిస్తూ అంజలి ఘటించేవారు. అలా అతనికి పతంజలి అనే పేరు స్థిరపడింది. పతంజలి తల్లికి సేవచేస్తూ, ఆమె మార్గాన్నే అనుసరించి శివుణ్ణి పూజించేవాడు. మాతృమూర్తి ఆదేశం మేరకు దక్షిణభారతానికి వెళ్లి, సముద్రతీరంలో పరమేశ్వరుడి దర్శనం కోసం తపస్సు చేశాడు.

నవీన యోగ పితామహుడు
మనదేశంలో వేదకాలం నుంచి యోగవిద్య ప్రాచుర్యంలో ఉంది. అనేక ధార్మిక గ్రంథాల్లో యోగశాస్త్ర ప్రస్తావన కనిపిస్తుంది. అయితే అప్పటి వరకూ సూత్రీకరించకుండా ఉన్న యోగసిద్ధాంతాలను పతంజలి క్రమబద్ధీకరించాడు. అందుకే ఈ మహర్షిని ఆధునిక యోగ పితామహుడిగా నిర్వచిస్తారు. పతంజలి 1800 రకాల యోగ నియమాలను 200 యోగసూత్రాలుగా గ్రంథస్థం చేశాడు. యమ (అహింస, సత్యవచనం, బ్రహ్మచర్యం, పరుల వస్తువులను ఆశించకపోవటం), నియమ (శౌచం, సంతోషం, తపస్సు తదితర నియమాలు), ఆసన (మనసును స్థిరంగా ఉంచడం), ప్రాణాయామ (శరీర స్పందనలు అన్నింటినీ క్రమబద్ధీకరించటం), ప్రత్యాహార (ఇంద్రియాలు గ్రహించే బాహ్యప్రపంచ శబ్దాలు, దృశ్యాలను పట్టించుకోకుండా అంతరంగం మీద దృష్టి నిలపటం), ధారణ (దైవాన్ని మనసులో నిలపడం), ధ్యాన (చుట్టూ ఆవరించి ఉన్న వేటినీ గమనించకుండా దేవుని యందే మనసును లగ్నంచేయటం), సమాధి (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతంగా శుద్ధమైన బుద్ధితో, సత్యమైన ఆనందంతో ఉండటం)- అనే సూత్రాలు ‘అష్టాంగ యోగం’లో భాగమే!

ఈశ్వర అనుగ్రహంతో చిదంబరానికి
పతంజలి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.. విశ్వరూపాన్ని దర్శింపచేయమని వేడుకున్నాడు. బదులుగా చిదంబర క్షేత్రంలో తన నాట్యాన్ని దర్శించమన్నాడు పార్వతీశుడు. పతంజలి ఆ ఆలయాన్ని దర్శించి, నటరాజ తాండవనృత్యం తిలకించాడు. స్వామిసేవలో తరించాడు. చిదంబరం ఆలయంలో పూజావిధానం, ఉత్సవ పద్ధతులను పతంజలి మహర్షే నిర్దేశించి, ఆ అంశాలను గ్రంథస్థం చేశాడని చరిత్ర కథనం. నేటికీ అక్కడి ఆలయంలో పతంజలి సూచించిన విధివిధానాల ప్రకారమే పూజాది కార్యక్రమాలు నిర్వహించటం విశేషం. ఆయన ఈ దేవాలయంలోనే ఆధ్యాత్మిక సాధనలతో మహర్షిగా మారి, పాణిని వ్యాకరణ సూత్రాలకు వ్యాఖ్యానం రాశాడు. మరో కథనం ప్రకారం అత్రి, అనసూయల కుమారుడే పతంజలి.

మనిషి, పాము రూపాల్లో..
పతంజలి మహర్షి రూపం విభిన్నమైంది. మనిషిలా శిరస్సు, సర్పరూపంలో శరీరం కలిగిన ప్రత్యేక ఆకారం ఆయనది. ఆ ముని ఆదిశేషుని అంశ అని లోకానికి తెలియటానికి పాము శరీరం, జ్ఞానార్జన కోసం మనిషి శిరోభాగంతో అవతరించాడని పురాణాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆదిశంకరాచార్యుల గురువు గౌడపాదుడు పతంజలి వద్ద శిష్యరికం చేసి వ్యాకరణవిద్య, యోగసూత్రాలను అభ్యసించాడని తెలియజేసే కథనం ప్రచారంలో ఉంది. యోగశాస్త్రానికి భాష్యం రాస్తూ- ‘యోగదాత, జ్ఞాననిధి, సర్వదుఃఖ నాశకుడు, విషధరుడు, ఆదిశేషుడి అపర అవతారుడు, సర్పరూపధరుడు అయిన పతంజలి మహర్షికి వందనాలు’ అంటూ అంజలి ఘటించాడు వ్యాసమహర్షి.

పాటించాల్సిన ప్రబోధనలు
ఏ విషయంలోనూ అతి పనికిరాదని చెబుతూ ‘దేహం గురించి శ్రద్ధ వహించాలి. శరీరాన్ని హింసించుకునేవారు రాక్షసులతో సమానం. మితిమీరి తినడం, ఉపవాసాలతో దేహాన్ని శుష్కింపచేయటం, అమితంగా నిద్రించటం, అసలే నిద్రించకపోవటం యోగాభ్యాసానికి తగవు. సర్వత్రా మధ్యేమార్గాన్ని అనుసరించాలి’ అని సందేశమిచ్చాడు పతంజలి మహర్షి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దిగులు చెందక మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే అనారోగ్యాలు దరిచేరవన్నాడు. మనోవికారాలకు లోనవకుండా ప్రశాంతచిత్తంతో ఉండేవారు ప్రజ్ఞావంతులని, ఆశయాలను సాధిస్తారని స్పష్టం చేశాడు. ముఖ్యంగా మనసును ఈ శరీరదృష్టి నుంచి లోతుగా తీసుకెళ్లి, ఆత్మసిద్ధికి ప్రయత్నించడమే యోగసాధన అని నిర్వచించాడు.

మనిషి.. మహర్షి..
శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం.. వీటితోనే జీవితానికి సార్థకత- అన్నాడు పతంజలి. శారీరకంగా, మానసికంగా పరిశుద్ధంగా ఉండటం శౌచం. కోరికల వెంట పరుగులు తీయక మనసుకు కళ్లెం వేసి సంతృప్తిగా జీవించటం సంతోషం. సదాచారాలూ, సద్భావనలతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం తపస్సు. అంతరంగాన్ని అధ్యయనం చేసుకుంటూ, తన ఉద్ధరణకు తోడ్పడే జ్ఞానాన్ని ఆర్జించటం స్వాధ్యాయం. అహంకారాన్ని వదిలి ఆ పరమాత్ముడికి శరణాగతులమై మనుగడ సాగించటం ఈశ్వరప్రణిధానం. ఈ సాధనతో మనిషి మహర్షిగా మారతాడని పతంజలి అభిప్రాయపడ్డాడు.

పంచుకోవటంలో పరమసుఖం
మనిషి తనవద్ద ఉన్నవాటిని నలుగురితో పంచుకుంటూ, తనకు చెందని వాటిని స్వీకరించకపోవటాన్ని ‘అస్తేయం’ అన్నాడు పతంజలి మహర్షి. పంచుకునే గుణం అద్వితీయ సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని అన్యాపదేశంగా చెప్పాడు. అలాగే ధనాశ, దురాశల్లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి దర్శించటం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిగా అభివర్ణించాడు. యోగ శిక్షణకు ఉపక్రమించే సాధకులు- ‘యోగశాస్త్రంతో మనోదోషాన్ని, శబ్దశాస్త్రంతో వాక్‌దోషాన్ని, వైద్యశాస్త్రంతో శరీరదోషాన్ని పొగొట్టిన పతంజలి మహర్షికి నమస్కరిస్తున్నాం’ అని ధ్యానించటం ఆ మహనీయుడి పట్ల అంతులేని గౌరవానికి నిదర్శనం.

తిరుచ్చికి 30 కి.మీ.దూరంలోని తిరుపత్తూరులో పతంజలి జీవసమాధి దర్శనమిస్తుంది. ఆ ప్రదేశాన్ని బ్రహ్మపురీశ్వర మందిరం అని పిలుస్తారు. నిత్యపూజలతో ఆ మహర్షికి అంజలి ఘటిస్తారు.