News

అహ్మదాబాద్‌ ప్రమాద ఘటన.. విమానంలో 169 మంది భారతీయులు

237views

గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌, ఒకరు కెనడాకు చెందిన వారున్నారు. మరోవైపు విమానం కుప్పకూలిన బీజే మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల్లో కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 నంబరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు. అత్యవసర బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయి పరిస్థితులను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఎయిరిండియా-171 విమాన ఘటనపై ఎయిరిండియా ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని కేంద్ర మంత్రులను ప్రధాని ఆదేశించారు.

  • ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాను. ఇది హృదయ విదారకర ఘటన. దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుంది’’ – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • ‘‘అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా’’ – ప్రధాని నరేంద్ర మోదీ
  • హృదయవిదారకం: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌
    లండన్‌ గాట్విక్‌కు బయల్దేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం చెందారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

    రంగంలోకి ‘ఏఏఐబీ’
    విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అటు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు ఘటనాస్థలానికి బయల్దేరారు. ప్రమాదానికి గల కారణాలపై వారు సమీక్ష చేపట్టనున్నారు.