News

బంగ్లాదేశ్ లో ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం

251views

బంగ్లాదేశ్‌లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్‌గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.

సందర్శకుడిని బంధించి..
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ
ఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్‌పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి డివిజన్‌లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్‌ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.