ArticlesNews

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

267views

ప్రాచీన భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యాలు వారి నిర్మాణ కౌశలానికి, నిర్వహణా సామర్థ్యానికీ ఎంతగానో పేరు గడించాయి. ఇటీవలే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఇటీవలే వెయ్యేళ్ళ కంటె పాతవైన అనంగ్ ఆనకట్ట ఫొటోలు విడుదల చేసింది. ఏ ఒక్క ఆధునిక పరికరమూ వినియోగించకుడా, మహా జల ప్రవాహానికి అడ్డుగా భారీ గేట్లు పెట్టకుండా ఆ ఆనకట్టను నిర్మించారు. ప్రాచీన భారతీయుల హైడ్రాలిక్ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ఇది గొప్ప గుర్తింపు. ఆ డ్యామ్‌లో వాన నీటిని ఒడిసి పట్టి నిలవ చేసి సమర్థంగా నిర్వహించడానికి ప్రాచీన భారతీయులు గురుత్వాకర్షణ ఆధారిత సాంకేతికతను ఉపయోగించారంటే ఆశ్చర్యం కలగక మానదు.

గ్రావిటీ బేస్డ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన ఆ ఆనకట్ట నిర్మాణానికి ఆదేశించిన వాడు 1100 ఏళ్ళ కంటె ముదు ఢిల్లీ పాలకుడైన అనంగపాల్ తోమర్ మహారాజు. ఢిల్లీ – హర్యానా సరిహద్దు దగ్గర అనంగపూర్ గ్రామంలో ఉన్న ఆ ఆనకట్ట ఒకప్పుడు వాననీటిని సేకరించి, ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యావసరాలకు తాగునీటిగా ఇవ్వడానికి నిల్వ చేయడానికి ఉపయోగపడేది. భారతదేశంలోని అతి పురాతనమైన ఆనకట్టల్లో అదీ ఒకటి.

ప్రాచీన ఢిల్లీకి నీరు ఎలా సరఫరా చేసేవారు?
ఢిల్లీ మహానగరానికి ప్రాచీన కాలంలో నీటిని సరఫరా చేసే విధానం గురించి తెలుసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. సూరజ్‌కుండ్, బడ్‌ఖల్ సరస్సు వంటి జలాశయాల్లో వర్షపు నీటిని సేకరించి సహజమైన పద్ధతుల్లో నిల్వ ఉంచే వారు. ఆ జలాశయాల గొలుసుకట్టు మధ్యలో అనంగ్ ఆనకట్ట ఉంది. ఆరావళి పర్వతాల మధ్య భాగంలో నిర్మించిన అనంగ్ ఆనకట్ట ఎలాంటి యాంత్రిక వ్యవస్థలూ లేకుండానే ఢిల్లీలో తొలినాళ్ళలోనే స్థిరపడిపోయిన వారికి నీటి సేవలు అందిస్తుండేది.

నిర్మాణ విశేషాలు:
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ – ఎఎస్ఐ వివరణ ప్రకారం అనంగ్ తాల్ చెరువు సూరజ్‌కుండ్‌కు నైఋతి దిక్కున ఉంది. దాన్ని 11వ శతాబ్దంలో తోమర్ వంశానికి చెందిన అనంగపాల్ తోమర్ పాలనా కాలంలో నిర్మించారు. ఆ ఆనకట్టలో అద్భుతమైన హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రతిభను ఇమిడ్చారు.

— ఆనకట్ట తూర్పు గోడ వాలుగా ఏర్పాటు చేసారు. దానివల్ల నిర్మాణపు బలం పెరిగింది. ఆ గోడ, దిగువ భాగం కంటె పైన, అంటే ఎగువ భాగంలో బాగా ఎక్కువ మందంగా ఉంది.

— ఆనకట్ట పశ్చిమ దిక్కులో రాతితో మలచిన మెట్లు ఉన్నాయి

— ఉత్తర, దక్షిణ దిక్కుల్లో కోణీయ పార్శ్వాల్లో మెట్లు మలిచారు

— ఆనకట్ట మొత్తం పొడవు సుమారు 101.2 మీటర్లు

— ఆనకట్టకు వేర్వేరు లోతులతో ఏడు డ్రయినేజీ ఛానెల్స్ ఉన్నాయి. దానివల్ల నీటిని ఎంత ఉంచాలి, ఎంత వదలాలి అన్నది నియంత్రణలో ఉంటుంది

— ఈ ఆనకట్టను నున్నగా చెక్కిన రాతి ముద్దలు, రాళ్ళ కట్టలు, సున్నపురాతితో నిర్మించారు. ఆధునిక పూర్వ దశకు చెందిన ఇంజనీరింగ్‌ కౌశల్యాన్ని ఈ ఆనకట్ట ప్రతిఫలిస్తుంది

అనంగపాల్ తోమర్ ఘనకీర్తి:
ఢిల్లీ మహానగరాన్ని నిర్మించిన చక్రవర్తిగా విశేషమైన కీర్తి అనంగపాల్ తోమర్ సొంతం. 11వ శతాబ్దంలో పరిపాలించిన అనంగపాలుడు తోమర్ వంశానికి చెందిన ఆఖరి సార్వభౌమ చక్రవర్తి. ఈ తోమర్ వంశం 8వ శతాబ్దపు తొలినాళ్ళలో ప్రారంభమైంది. ఆ వంశం అనంగపూర్‌ను రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతం అంతా తమ ప్రభావాన్ని ప్రసరింపజేసారు.

అనంగపాలుడు ఎన్నో కోటలు, దేవాలయాలు, ప్రజా సేవల సంస్థలూ నిర్మింపజేసాడు. వాటిలో చాలా వరకూ ధ్వంసం అయిపోయాయి. కాలం పరీక్షను తట్టుకుని నిలబడలేకపోయాయి. అయితే అనంగ్ ఆనకట్ట, అనంగ్ తాళ్ మాత్రం అనంగపాలుడి కీర్తికి ప్రతీకలుగా, పతాకలుగా నిలిచాయి.

అనంగ్ తాల్ – జాతీయ స్మారకం:
ఢిల్లీలోని మెహరౌలీలో ఉన్న అనంగ్ తాల్ కూడా అనంగపాల్-2 నిర్మింపజేసారు. 2022లో దాన్ని భారత ప్రభుత్వం జాతీయ స్మారకంగా ప్రకటించింది. ఎఎస్ఐ వ్యవస్థాపక డైరెక్టర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ 1862 నుంచి 1865 అంటే మూడేళ్ళ వ్యవధిలో ఆ జలాశయం డైమెన్షన్లను కొలిచి సరిచూసారు. ఉత్తర దక్షిణాల్లో 169 అడుగులు, తూర్పు పడమర దిక్కుల్లో 152 అడుగులు ఉన్నాయి. జలాశయం లోతు 40 అడుగులు ఉంది. దానివల్ల ఈ జలాశయంలో ఒకేసారి సుమారు 10లక్షల ఘనపు టడుగుల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం (2025లో) ఢిల్లీ ప్రభుత్వం ఆ జలాశయాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టింది. ఆ క్రమంలోనే ఆ ప్రాచీన జలాశయాన్ని పూర్తిగా శుభ్రం చేసారు. టన్నుల కొద్దీ పేరుకునిపోయిన చెత్తను తొలగించారు. అలా ఢిల్లీ చారిత్రక కట్టడాల్లో గొప్పదైన నిర్మాణాన్ని పునరుజ్జీవింపజేసే కార్యక్రమాన్ని చేపట్టారు.