
హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.తిరుమలలోని జపాలి హనుమాన్‌కు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు, అధికారులు ఛైర్మన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్‌కు ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఛైర్మన్‌ను సింధూర వస్త్రంతో సన్మానించి, స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ జపాలి హనుమాన్‌కు పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులందరికీ హనుమంతుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని మంత్రి కందులు దుర్గేశ్ గురువారం దర్శించుకున్నారు. తొలుతు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వెంట పారిశ్రామికవేత్త భూపతి రాజు వరాహ వెంకట సూర్యనారాయణ రాజు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ భూపతి రాజు రవి వర్మ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెదేపా నాయకులు పాల్గొన్నారు.