News

పాకిస్తాన్‌లో “రాహుల్ గాంధీ” ట్రెండింగ్..

83views

కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం పాకిస్తాన్‌లో హీరోగా మారాడు, ముఖ్యంగా పాక్ మీడియా ఇటీవల రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని కోట్ చేస్తూ తెగ సంబరపడిపోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోని ట్వీట్ చేసి, ఆపరేషన్ సిందూర్‌ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే కాకుండా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది..? అని ప్రశ్నించారు. సైనిక చర్య గురించి ముందే పాకిస్తాన్‌కి సమాచారం ఇవ్వడం నేరం అని ఎక్స్‌లో అన్నారు.

అయితే, ఇప్పుడు పాకిస్తాన్ మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఫెయిల్ అయిందని, భారత్‌ని పాకిస్తాన్ ఓడించిందని చెబుతూ ఆ దేశం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. పాక్ ఆర్మీ భారత దాడుల్లో తన ఎయిర్ బేసులు ధ్వంసం అయినా, వైమానిక రక్షణ వ్యవస్థల్ని కోల్పోయినా కూడా ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కి చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని, ముఖ్యంగా రాఫెల్‌ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు, రాహుల్ గాంధీ కూడా ఎన్ని ఫైటర్ జెట్స్‌ని భారత్ కోల్పోయింది..? అని ప్రశ్నించడంతో పాక్ మీడియా పండగ చేసుకుంటోంది. పాకిస్తాన్ వాదనలకు బలం కూర్చేలా రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో ఆ దేశ మీడియా ప్రత్యేక డిబేట్‌లు నడుపుతోంది.

అయితే, రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్ ‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడుతూ, జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడని స్పష్టత ఇచ్చింది. ‘‘ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత మేము ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, పాక్ ఆర్మీకి చెప్పాము. అయితే వారు దీనికి దూరంగా ఉండాలని సూచించాము. అయితే, ఈ సలహాను వారు పాటించలేదు’’ అని జైశంకర్ చెప్పిన వీడియోని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు.

ఒక వేళ దాడుల గురించి పాకిస్తాన్‌కి ముందే తెలిసి ఉంటే, మురిడ్కే, బహవల్పూర్ వంటి ఉగ్రస్థావరాల్లో ఉగ్రవాదుల్ని ఉంచేవారా..?, ఆపరేషన్ సిందూర్‌లో 100 కన్నా ఎక్కువ ఉగ్రవాదులు మరణించే వారా..? అని పలువురు మాజీ సైనికాధికారులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ని హతమార్చిన తర్వాత అమెరికా పాకిస్తాన్‌కి సమాచారం అందించింది, 2019 బాలాకోట్ దాడుల తర్వాత కూడా మన డీజీఎంఓ దాడి వివరాలను పాకిస్తాన్‌కి అందించారని, ఇది సాధారణ విషయమే అని చెబుతున్నారు.