
భారతీయ జర్నలిజం తిరిగి నారదుడి ధృక్కోణంతో తిరిగి అనుసంధానం కావాలని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ అభిప్రాయపడ్డారు. భారతీయ సంప్రదాయంలో దేవర్షి నారదుడ్ని మొదటి జర్నలిస్టుగా పేర్కొంటామని, ముల్లోకాల సంక్షేమం కోసం బలంగా విషయాన్ని వెల్లడించే సంభాషణ కర్తగా కూడా చెప్పుకుంటామని అన్నారు. ఒడిశాలో జరిగిన నారద జయంతి, నారద సమ్మాన్ కార్యక్రమంలో ప్రఫుల్ల కేత్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రఫుల్ల కేత్కర్ మాట్లాడుతూ అప్పటికప్పుడే రిపోర్టింగ్ చేసే సాధన చేశారని, వాస్తవాలను ధ్రువీకరించుకొనే చెప్పేవారని అన్నారు. సమాజ శ్రేయస్సు దృష్టా ఏ సమాచారాన్ని పంచుకోవాలి? ఏ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదో అనే విషయంలో తన విచక్షణను ఉపయోగించి వెల్లడించేవారని పేర్కొన్నారు. భారతీయ పాత్రికేయులు నారదుడి కమ్యూనికేషన్ శైలి నుంచి ప్రేరణ పొందాలని సూచించారు. అందరి సంక్షేమం అన్న లక్ష్యంతోనే నారదుల వారు పనిచేసేవారని గుర్తు చేశారు.
భారత దేశ ఆధ్యాత్మిక, సాహిత్యంలో నారదుడు ఓ ప్రముఖ వ్యక్తి అని, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతంలో కూడా వారు కనిపిస్తారని పేర్కొన్నారు.మూడు ముఖ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని లోకాలకు సమాచారాన్ని పంచేవారని, కచ్చిత్వతం-వాస్తవికత, జ్ఞానాన్ని అన్వయించడం మరియు స్పష్టమైన ఉద్దేశ్యంతో పాటు సర్వజన హితాయ అన్న సూత్రాల ఆధారంగా పనిచేసేవారని తెలిపారు. నారదుడు ఓ వ్యక్తి కాడని, ఓ ధార్మిక సమాచార సంస్థ గా అభివర్ణించారు.
ఒకానొక సమయంలో నారదుడ్ని సమస్యాత్మక వ్యక్తిగా కొందరు చిత్రీకరించారని కేత్కర్ మండిపడ్డారు. ఇది కేవలం నారదుడి విషయంలోనే కాదని, భారతీయ చిహ్నాలు, ఇతర విషయాలకు కూడా ఈ తప్పుడు ప్రచారం విస్తరించిందన్నారు. మీడియా చిత్రీకరణలు, బ్రిటీష్ అనువాద గ్రంథాల ద్వారా మన సాంస్కృతిక వ్యక్తులను అగౌరవ పరిచారన్నారు.
మరోవైపు భారతీయ భాషా జర్నలిజం మూలాలను కూడా కేత్కర్ ప్రస్తావించారు. 1826 లో జుగల్ కిషోర్ శుక్లా కలకత్తా నుంచి మొదటి హిందీ వార పత్రిక ‘‘ఉదాంత్ మార్తాండ్’’ ను ప్రారంభించారన్నారు. ఆ పత్రిక ముఖ చిత్రం నారదుడని తెలిపారు. అలాగే 1955లో, కె.ఎం. మున్షీ నేతృత్వంలోని కమిటీ నారదుడిని భారతీయ సంప్రదాయానికి చెందిన మొదటి జర్నలిస్ట్‌గా అధికారికంగా గుర్తించిందన్నారు.
దేవర్షి నారదుడి జీవితం, ఆదర్శాలను ఆధార భూతంగా మన జర్నలిజంలో భారతీయ విలువలను తిరిగి స్థాపించాలన్న లక్ష్యంతో కొన్ని సంవత్సరాలుగా నారద జయంతి జరుపుతున్నామని, విశ్వసంవాద్ కేంద్ర ఈ ప్రయత్నాలను చేస్తోందని వివరించారు. నారదుడి సూత్రాలకు భిన్నంగా, సమకాలనీ జర్నలిస్టులు చాలా మంది ప్రాథమిక బాధ్యతలనే విస్మరించారని అన్నారు. అలాగే కొంత మంది జర్నలిస్టులు భారత దేశాన్ని పాశ్చాత్య దృష్టికోణం నుంచి చూస్తున్నారని విమర్శించారు. వీరందరూ భారత దేశ దృక్పథాన్ని చూడలేకపోతున్నారని అన్నారు. భారత్ ఎందుకు ప్రత్యేకమైనదో వారు గుర్తించలేకపోతున్నారని విమర్శించారు.





