News

పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యం

263views

భారత్‌ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, అదామ్‌పుర్‌, భఠిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి, భుజ్‌ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఏఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలోనే భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు నియంత్రణ రేఖ (LoC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్‌, పూంచ్‌, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులుచేస్తోంది. వీటిలో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.