
‘రాష్ట్రంలో ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలంలో మాత్రమే వచ్చిన భక్తులందరికీ నిత్యం అన్నప్రసాదం అమలు జరుగుతోంది. ఇతర ఆలయాల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 15 ప్రధాన, ముఖ్య ఆలయాల్లోనూ అందరికీ అన్నప్రసాదం అమలు చేయాలి. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలి. రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా చూడాలి. ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యత పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి… తితిదే ఏర్పాటు చేస్తున్న ‘బాలాజీ ఆలయ నిర్మాణ నిధి’ నుంచి సహాయం తీసుకోవాలన్నారు. పాత ఆలయాల పునరుద్ధరణ పనులకు దేవాదాయ శాఖలోని సర్వ శ్రేయో నిధి(సీజీఎఫ్)ని వినియోగించాలన్నారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ, తితిదే సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధాన, ముఖ్య ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన్‌లు సిద్ధం చేయాలని, అవి ఆగమశాస్త్రానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. ‘శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసే వీలుంది. అక్కడ పరిమితంగా ఉన్న దేవాదాయ శాఖ భూములను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి’ అని సీఎం సూచించారు.
సమగ్ర విధానం తేవాలి
‘దేవాలయాల భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసి, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా కమిటీ వేసి సమగ్ర విధానం తీసుకురావాలి. వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలి. భూములను హోటళ్లకు లీజుకు ఇచ్చినప్పుడు.. శాకాహారం మాత్రమే ఉండేలా అనుమతించాలి. అన్ని ఆలయాల ఆదాయాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆస్తుల వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రూ.50 వేలకుపైగా వార్షికాదాయం ఉన్న దేవాలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. కమిటీలు ఏర్పాటుచేసి, ప్రతి చోటా నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉండేలా చూడాలి’ అని సీఎం ఆదేశించారు.
ఖాళీల భర్తీకి పచ్చజెండా
‘డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, సహాయ కమిషనర్ పోస్టులు 5, గ్రేడ్-1 ఈవో పోస్టులు 6, గ్రేడ్-3 ఈవో పోస్టులు 104, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16… కలిపి 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తికావాలి. ఆలయాల్లో 200 వరకు వైదిక సిబ్బంది పోస్టుల ఖాళీలను అర్హులైన వారితో భర్తీ చేయాలి’ అని చంద్రబాబు ఆదేశించారు.
175 ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు
రాష్ట్రంలో 175 ఆలయాల్లో ఆన్‌లైన్ దర్శనం, సేవలు, వసతి, ఈ-హుండీ వంటివి అమలు చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. రూ.7 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న 22 ఆలయాల్లో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆలయాల్లో పరిశుభ్రత పాటించేలా కేంద్రీకృత పారిశుద్ధ్య నిర్వహణ టెండర్లు పిలిచామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల వద్ద హారతులను ప్రతినిత్యం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా నోటిఫైడ్ ఆలయాల ద్వారా ఏటా రూ.1,300 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని, ఇందులో ఏడు ప్రధాన క్షేత్రాల నుంచే రూ.850 కోట్లు సమకూరుతున్నట్లు చెప్పారు. సర్వ శ్రేయో నిధి(సీజీఎఫ్) కింద వివిధ ఆలయాల్లో రూ.111 కోట్లతో 48 పనులు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి వాడరేవు వినయ్‌చంద్, కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.





