News

ఆపరేషన్‌ సిందూర్‌.. పహల్గాం బాధితుల రియాక్షన్‌

329views

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ‍ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్‌ ప్లాన్‌ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్‌ ఉగ్రస్థావరాలపై ఎటాక్‌ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటినుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

సంతోష్‌ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే స్పందిస్తూ.. ఈ ఆపరేషన్‌ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు.

సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి స్పందిస్తూ..‘పాకిస్తాన్‌లో తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం. మా కన్నీళ్లు ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారుఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు. మేం ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు’ అని అన్నారు.