
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన వారిపై అస్సాంలో చర్యలు తీసుకొన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 42 చేరిందన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇప్పటికే ఇటువంటి ఆరోపణలపై ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్‌ను అరెస్టు చేశారు. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టినట్లు నాడు సీఎం ప్రకటించారు. మరోవైపు అమినుల్ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని పేర్కొంది.
ఇటీవల ధుబ్రిలో పంచాయతీ ఎన్నికల ర్యాలీలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ‘‘పహల్గాం దారుణోదంతం తర్వాత కూడా ఇక్కడ పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారి కాళ్లు విరగ్గొట్టాలి. రాష్ట్రంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన పలువురిని అరెస్టు చేశాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. అయినా కొంతమంది ఆకతాయిలు పాక్‌కు అనుకూల నినాదాలు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా వారి కాళ్లు విరగ్గొట్టి మరీ అరెస్ట్ చేసి జైళ్లో వేయాలని పోలీసులకు ఈ సందర్భంగా సూచిస్తున్నా. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి అమాయక ప్రజలను చంపినా.. ఇక్కడి నుంచి పాక్‌కు మద్దతు తెలపడం దారుణం. మన దేశంలో నివసిస్తూ.. ఇక్కడి తిండి తింటూ పాక్‌కు మద్దతు తెలిపేవారు మాకు అవసరం లేదు. అలాంటి వారిని దేశం, రాష్ట్రం క్షమించదు, సహించదు’’ అని సీఎం గట్టిగా హెచ్చరించారు.
ఇక జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్‌లో పర్యటించటాన్ని కూడా హిమంత తప్పుపట్టారు. అక్కడి ఎన్‌జీవో ఇస్తున్న సొమ్మును గౌరవ్ తీసుకొంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. పాక్‌కు మద్దతు తెలిపిన 40 అరెస్టు చేసినప్పుడు.. ఆ దేశాన్ని పర్యటించిన గొగొయ్‌పై కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. పాక్‌లో ఆయన ఏ ప్రాంతాల్లో తిరిగారో సమాచారం ఇవ్వాలన్నారు.





