News

వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌

237views

వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లు (Waqf Amendment Bill)ను ఆమోదించాయి. దీనిపై తాజాగా ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన.. తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం బిమ్‌స్టెక్‌ సదస్సు నిమిత్తం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘వక్ఫ్‌ సవరణ బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం ఓ చరిత్రాత్మక మలుపు. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం మన సమష్టి అన్వేషణలో ఓ కీలక ఘట్టం. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంట్‌ సభ్యులకు కృతజ్ఞతలు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయి. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంతో వారి హక్కులకు భద్రత లభించినట్లయ్యింది. ఈ బిల్లుతో ఇప్పుడు సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన, సమ్మిళిత భారత్‌ను కలిసి నిర్మిద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

సుదీర్ఘ చర్చ తర్వాత బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు, ‘ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లు’కు.. గురువారం రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్‌ బిల్లు పేరును…యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లుగా (ఉమీద్‌-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.