News

ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం : అమిత్‌షా వెల్లడి

293views

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని దేశంలో అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అది తప్పకుండా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. నిజానికి రాజ్యాంగ పరిషత్తు నిర్ణయాల్లో అది ఒకటి అని, కాంగ్రెస్‌ పార్టీ దానిని మరిచిపోయినా తాము గుర్తుపెట్టుకుని, ఎన్నికల హామీ అమలుకు నడుం బిగించామని చెప్పారు. దిల్లీలో ‘టైమ్స్‌ నౌ 2025 సదస్సు’లో ఆయన ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి చట్టం చేసిన రీతిలోనే భాజపా పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా యూసీసీని ప్రవేశపెడతాయన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచాయని, మరో 30 ఏళ్లు అధికారంలో కొనసాగుతామని అమిత్‌షా చెప్పారు.

పార్లమెంటులో కొన్ని పద్ధతులు ఉంటాయి
పార్లమెంటు నడుస్తున్న తీరుపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపణల్ని అమిత్‌షా తోసిపుచ్చారు. లోక్‌సభలో రాహుల్‌కు కేటాయించిన సమయంలో ఆయన వియత్నాంలో ఉన్నారని, సభలో మాట్లాడే నిబంధనల గురించి విపక్షనేత తెలుసుకోవాలని చెప్పారు. ‘పార్లమెంటులో మాట్లాడాలంటే కొన్ని పద్ధతులుంటాయి. అంతేగానీ కాంగ్రెస్‌ పార్టీలా ఒక కుటుంబంలో మాట్లాడినట్లు ఎప్పుడంటే అప్పుడు కుదరదు’ అని స్పష్టంచేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెప్పారు.

పునర్విభజనలో ఎవరికీ అన్యాయం జరగదు

డీఎంకేను తమిళ వ్యతిరేకిగా అమిత్‌షా అభివర్ణించారు. తమిళనాడు ప్రభుత్వం వైద్య, ఇంజనీరింగ్‌ విద్యను తమిళ మీడియంలో ప్రవేశపెట్టలేదని, కనీసం ఆ కోర్సుల పుస్తకాలను తమిళంలోకి అనువదించలేదని విమర్శించారు. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన గురించి కేంద్రం ఏమీ చెప్పకపోయినా, ఎన్నికల దృష్టితో డీఎంకే హడావుడి చేస్తోందని, ఐదేళ్లలో పీకల్లోతు అవినీతిలో ఆ ప్రభుత్వం కూరుకుపోయిందని విమర్శించారు. నియోజకవర్గాల పరంగా అన్యాయం జరిగే అవకాశం 0.0001 శాతం కూడా లేదన్నారు.