
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది రోజైన ఆదివారం నాడు నాగపూర్‌లోని రేషంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఇదే రోజు డాక్టర్ హెడ్గేవార్ జయంతి అయినందున వారికి పూలతో నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్ గురూజీ స్మృతి మందిరానికి కూడా వెళ్లి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సంఘ జ్యేష్ఠ ప్రచారక్ భయ్యాజీ జోషి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వున్నారు.

తన సందర్శన గురించి మోదీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో వివరించారు. ‘‘నాగపూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించడం గొప్ప అనుభవం. ఇవాళ ఉగాది పర్వదినం, పరమపూజ్య డాక్టర్ సాహెబ్ జయంతి కూడా కావడం ఈ పర్యటనను మరింత ప్రత్యేకం చేసింది’’ అని వెల్లడించారు.
తన జీవితం మీద డాక్టర్ హెడ్గేవార్, గురూజీ గోళ్వాల్కర్ ప్రభావం గురించి మోదీ వివరించారు. ‘‘పరమపూజ్య డాక్టర్ సాహెబ్, పూజ్య గురూజీ ఆలోచనల నుంచి నాలాంటి అసంఖ్యాక ప్రజలు ప్రేరణనూ, శక్తినీ పొందారు. ఆ ఇద్దరు మహానుభావులూ శక్తివంతమైన, సమృద్ధమైన, సాంస్కృతిక స్వాభిమానం కలిగిన భారతదేశాన్ని సంభావించారు. వారికి నివాళులు అర్పించే అవకాశం కలగడం గొప్ప గౌరవం’’ అన్నారు.
నాగపూర్‌లో ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే తదితరులు ఆయనకు విమానాశ్రయం దగ్గర స్వాగతం పలికారు.
డాక్టర్జీకి నివాళులు అర్పించిన తర్వాత స్మృతిమందిరం దగ్గర విజిటర్స్ బుక్‌లో ప్రధానమంత్రి మోదీ తన సందేశం రాసి సంతకం చేసారు. ‘‘పరమ పూజనీయ హెడ్గేవార్‌జీ, పూజనీయ గురూజీలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్మృతిమందిరానికి రావడం, వారి స్మృతులను తలచుకోవడం గొప్ప అనుభూతి. భారత సంస్కృతికి, జాతీయతావాదానికీ, సంఘ విలువలకూ అంకితం చేసిన ఈ ప్రదేశం మనలను అందరినీ దేశ సేవలో ముందుకు నడిచేలా ప్రేరణ కలిగిస్తుంది. సంఘానికి బలమైన పునాదులైన ఈ ఇద్దరు మహానుభావుల స్మృతి కేంద్రమైన ఈ ప్రదేశం దేశ సేవకు అంకితమైన లక్షలాది స్వయంసేవకులకు శక్తినిచ్చే కేంద్రం’’ అని మోదీ తన సందేశంలో రాసారు.
ప్రధానమంత్రి నాగపూర్ పర్యటనలో ‘దీక్షాభూమి’ని కూడా సందర్శించారు, బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.





