
గోశాలలు, పశువుల పాకలు నిర్మించడం ద్వారా బిజెపి దుర్గంధాన్ని వ్యాప్తి చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిజెపి దుర్గంధాన్ని వ్యాపింపజేస్తుండగా తమ పార్టీ సుగంధాన్ని పంచిందని గొప్పలు చెప్పారు. ఆయన కనౌజ్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. “కనౌజ్ ఎప్పుడూ సోదరభావమనే సుగంధాన్ని వ్యాప్తి చెందించింది. అయితే బిజెపి పని ఎప్పుడూ ద్వేష మనే దుర్గంధాన్ని వ్యాపిం పజేయడమే. బిజెపి అనే ఈ దుర్గంధాన్ని పూర్తిగా తొలగించాలని కనౌజ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆయన నోరు పారేసుకున్నారు.
అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక రైతు బిడ్డ పశువుల నుంచి వచ్చే వాసనను దుర్గంధంగా భావిస్తున్నాడంటే.. అతడి మూలాల నుంచి అతడు దూరమైనట్లే’’నని అన్నారు. పశువుల పేడ దుర్గంధగా కనిపిస్తే.. ఆ నాయకుడు లేదా పార్టీ దాదాపు రాజకీయంగా మూతపడే స్థితికి వచ్చినట్లేనని ఈ సందర్భంగా అన్నారు.





