
పురాణాలు భారతీయ సాంస్కృతిక దీపాలు. వాటిలో ఎంతో జ్ఞానం ఉంటుంది. రామకృష్ణ పరమహంస జ్ఞానానుభవ ప్రాధాన్యం గురించి ఒక దృష్టాంతం చెబుతారు. ఇద్దరు మిత్రులు మామిడితోటకు వెళ్లారు. వారిలో ఒకరు తోటలోని చెట్లనీ పండ్లనీ లెక్కపెడుతూ రోజంతా గడుపుతాడు. రెండోవాడు ఫలాలన్నీ తిని రుచులను ఆస్వాదిస్తాడు.
వ్యాసకృతమైన అష్టాదశ పురాణాలు, సాత్విక రాజస తామసాలనే మూడు రకాలు. సాత్విక పురాణమైన గరుడ మహాపురాణం అందులో ముఖ్యమైంది. విష్ణువుని వృక్షంగా అభివర్ణించిన గరుడ పురాణం, ఆ చెట్టుకు మూలమైన వేరు ధర్మం అని, దాని కాండం వేదాలని, పురాణాలు శాఖలని చెబుతుంది. వేదం చెప్పే సత్కర్మలే పువ్వులు, మోక్షమే ఫలం. అన్నీ కలిపితేనే విష్ణువు. సత్కర్మ చేస్తేనే మోక్షమనే ఫలం అందుతుందనేది దీని తాత్పర్యం. ఇదే గరుడ పురాణం ప్రత్యేకత. పురాణాలను శౌనకాది మునులకు చెప్పే సూతుడికి, ఈ పురాణాన్ని వ్యాసుడు స్వయంగా చెప్పాడు. వ్యాసుడికి కశ్యపుడు, కశ్యపుడికి గరుత్మంతుడు, గరుడుడికి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే మొదటిసారిగా చెప్పాడని అంటారు. మనసులోని రజస్తమో గుణ వికారాలు విషం వంటివని, బ్రహ్మవిద్య అమృతం లాంటిదని భగవానుడు బోధిస్తాడు.
ఏ విధమైన కష్టనష్టాల బారిన పడకుండా, ముందు జాగ్రత్తగా ఎలా బతకాలో చెప్పేదే గరుడ పురాణం. కలలాంటిదే ఈ జీవితమని, కర్మఫలం ప్రకారమే అంతా జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరూ దేనికోసమూ ఆరాటపడరు. మరణానంతరం ప్రయాణించే మార్గమెలా ఉంటుందో జగద్గురు శంకరాచార్య పదిహేడు శ్లోకాల్లో వర్ణిస్తారు. పాపం చేయకూడదనే నిగ్రహం లేనంత కాలం ఎలాంటి పూజలు చేసినా ఫలితం శూన్యమని పెద్దలు చెబుతారు. పాపాలకు నరకాలలో శిక్షలు తప్ప విచారణలు ఉండవు. ఈ గరుడ పురాణంలో జ్యోతిష శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, రత్న శాస్త్రం, తీర్థ మహిమల విశేషాలుంటాయి. పితృదేవతల వివరణ, ఏ మూలం నుంచి జీవుడు జన్మించాడు, ఎందుకు జన్మించాడు, వారి అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది అన్న వివరణ కనిపిస్తుంది. వ్రత విధానాలు, తిథి వార నక్షత్రాల ప్రాధాన్యాలు, నీతిశాస్త్రం, ఆశ్రమ వ్యవస్థ, బ్రహ్మవిద్య, అవతార గాథలు… ఇలా ఒకటేమిటి, అనేక గ్రంథాల సమాహారమే గరుడ పురాణం. గో శాస్త్రం, అశ్వశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఛందస్సు, యోగశాస్త్రం సహా సర్వ విజ్ఞానం దీంట్లో దాగి ఉంది. అందుకే హిందూ విజ్ఞాన సర్వస్వ మూల గ్రంథం గరుడ పురాణం అని పెద్దలు చెబుతారు.
దహన సంస్కారాల్లో భగవద్గీతా పఠనం, సంతాప దినాలలో గరుడ పురాణ పారాయణం లాంటివి చెడు సంప్రదాయాలు. ఈ రెండు భగవత్వచనాలు నిత్య పారాయణాలు. గరుడ పురాణం అందించే విజ్ఞానాన్ని, జ్ఞానఫలాన్ని గ్రహించి ఆస్వాదించాలి. అలా జీవితాన్ని సార్థకం చేసుకుని, ముక్తికి బాటలు వేసుకోవడమే మన కర్తవ్యం.




