ArticlesNews

భారత అణు విజ్ఞానానికి ఆద్యుడు హోమీ జహంగీర్ బాబా

61views

ధునిక భారతదేశంలో విజ్ఞానానికి ఆద్యుడు హోమీ బాబా. ఆయన దూరదృష్టి, సంఘటన కౌశలం, ప్రోత్సాహం, మార్గదర్శనం కారణంగా అనంతర కాలంలో అనేకమంది యువ శాస్త్రవేత్తలు భారత దేశం కోసం అమూల్యమైన విజ్ఞానాన్ని అందించగలిగారు. హోమీ బాబా చిత్రకారుడు కూడాను. ప్రకృతి ఆరాధకుడు ఆయన. ఆయన జీవితంలో, మేథలో శాస్త్ర విజ్ఞానం, కళాభిరుచి సమానంగా నిండి ఉన్నాయి. ఆయన జీవితం యావత్ భారతీయులకు ఆదర్శం.

భారత పరమాణు విజ్ఞాన ప్రగతికి వ్యూహకర్త అయిన హోమీ జహంగీర్ బాబా 1909లో ముంబైలో జన్మించారు. 1930లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. అందులో ఆయన ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

బాబాకి ఉన్న పేరు ప్రఖ్యాతులకు మరి ఏ దేశంలోనైనా గొప్ప ఉద్యోగం దొరికేది. కానీ విదేశీ భౌతిక సుఖాలు ఆయనను ఆకర్షించలేదు. మాతృభూమి సేవకై తనను తాను సమర్పించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

యువకుడైన బాబా ఆధునిక భారతదేశం గురించి కలలు కనడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో అణు భౌతిక శాస్త్ర అధ్యయనానికి తగిన వసతులు లేవు. సరిపడినన్ని ఉపకరణాలు కూడా లేవు. కానీ బాబా అధైర్యపడలేదు. తనకు కావలసిన వసతులను, ఉపకరణాలను తానే సమకూర్చుకునే పథకం తయారు చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఆయనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరమని ఆహ్వానం వచ్చింది. కానీ బాబా దానిని తిరస్కరించారు. గొప్ప పరిశోధన కేంద్రాన్ని భారత్లోనే స్థాపించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ట్రాంబే అనే సంస్థను ప్రారంభించారు.  దాని వికాసం కోసం హోమీ బాబా చాలా శ్రమించారు.

మొదట్లో భారత అణుయుగానిది సంక్రమణ కాలమే. విదేశాల్లో ఉంటున్న యువ శాస్త్రవేత్తలకు ట్రాంబే రండి, మాతృభూమికి తిరిగి రండి అంటూ పిలుపునిచ్చారు. ఆ ఆహ్వానాలు అందుకుని ఎందరో యువ శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారిలో ఈరోజు భారతదేశంలో ప్రఖ్యాతినొందిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. వారందరికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు బాబా వ్యక్తిగతంగా శ్రద్ధ వహించేవారు.

1974లో భారత్ మొదటి అణు విస్ఫోటనం జరిపింది. శాంతి కార్యక్రమాల కోసం ఫోఖ్రాన్ లో జరిగిన ఈ విస్ఫోటనంతో భారత్ ఆరవ అణు శక్తి దేశంగా అవతరించింది. ఇది పూర్తిగా స్వదేశీ ప్రయత్నాల ఫలితం. భారత్ ను ఈ శిఖరాగ్రానికి చేర్చింది బాబాయే. ప్రపంచ అణు దేశాల మ్యాపులో భారత్ కు స్థానం లభించడం ఆయన శ్రమ ఫలితమే.

కష్టించి పనిచేసేవారిని, సక్రమంగా, సజావుగా ఉండేవారిని బాబా ఇష్టపడేవారు. ఏదైనా పనిలో పొరపాటున తప్పు జరిగితే క్షమించే వారు. కానీ నిర్లక్ష్యంగా, సోమరిలా పనిచేసేవారిని భరించేవారు కాదు. నిజాయితీగా పని చేసేటప్పుడు తప్పు జరిగితే మిన్నకుండేవారు.

బాబా జీవితాంతం బ్రహ్మచారి గా ఉన్నారు. “జీవితంలో మీరు చావు తప్ప ప్రతి విషయాన్ని నిర్దేశించగలరు.” అనేవారు. బాబా కృషి వల్లనే భారతదేశం ఎద్దుల బండి యుగం నుండి అణు శక్తి యుగంలోకి ప్రవేశించింది. అణు పురుషుణ్ణి  వినాశనము నుండి నిర్మాణ మార్గంలోకి మళ్లించిన ఘనత బాబాకే దక్కుతుంది.

1966లో విషాదకరమైన రోజు. బాబా తన శాంతి బృందంతో ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్నారు. ఆ బృందం ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై బాబా ఆత్మ పరమాత్మను చేరింది. భారత జాతి శోకసంద్రంలో మునిగింది.

ఎవరైనా చనిపోయినప్పుడు పని ఆపి వేయడాన్ని బాబా వ్యతిరేకించేవారు. “కృషితో నాస్తి దుర్భిక్షం” ను గుర్తుచేసుకుంటూ ఎక్కువ పని చేయడమే హుతాత్మకు నిజమైన శ్రద్ధాంజలి అనేవారు. బాబా మరణ వార్త విన్నప్పుడు ఆయన సహోద్యోగులు, ఆయన కింద పనిచేసే వారు అందరూ పనిలో లీనమై ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ట్రాంబే సంస్థకు “బాబా అణు శక్తి ప్రతిష్ఠాన్” గా నామకరణం చేయడం ఆ మహనీయుని పరిశోధనలకు లభించిన అసలు సిసలు గుర్తింపు.

కొందరు అసామాన్య వ్యక్తుల శ్రమ, సాధనల పైననే మానవతా వికాసం ఆధారపడి ఉంటుంది. అలాంటి అసామాన్యుల లో బాబా ఒకరు. చావు పుట్టుకలు సృష్టి నియమాలు. కానీ మనిషి తన కర్తృత్వంతో ఏదో ఒకటి సాధించినప్పుడు మాత్రమే అతని జీవితం ధన్యం అవుతుంది. బాబా కూడా అలాంటి పుణ్య పురుషుడే. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కోసం, అంతటి సుపుత్రుడి కోసం భారతమాత ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది.

నేడు హోమీ బాబా జయంతి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.