
మార్గరెట్ నోబుల్ ఐర్లాండ్ కు చెందిన యువతి. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రభావానికి లోనై తమ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడి ప్రజలపట్ల సేవా భావాన్ని ప్రదర్శించారు. ఆమెకు నివేదిత అని నామకరణం చేశారు. అంటే ఈశ్వరునికి అర్పించబడినది అని అర్థం. ఆమె చిన్న పిల్లలకు, వారి తల్లులకు విద్యా దానం చేసింది. ప్లేగు, క్షామం, వరదలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసినప్పుడు, కరుణ నిండిన సేవామూర్తిగా అందరి మన్ననలు పొందినది. త్యాగ, సేవా భావాలకు నివేదిత తిరుగులేని ప్రతీక.
చికాగోలో జరిగిన సర్వ ధర్మ సమ్మేళనంలో ఆహ్వానం లేకపోయినా పాల్గొని తన ప్రేరణదాయకమైన ప్రసంగంతో కోట్లాది అమెరికన్ల హృదయాలను జయించిన స్వామి వివేకానందుని తన గురువుగా గుర్తించింది.
ఒకసారి ప్రవచనాల మధ్యలో స్వామీజీ “ప్రజల కోసం తమను తాము సమర్పించుకునే వారు, భగవంతుని కార్యం తప్ప మరే కార్యం చేపట్టని వారు, తమకంటూ అస్థిత్వాన్ని కోరుకోని వారు…. అలాంటి 20 మంది స్త్రీలు, 20 మంది పురుషుల యొక్క అవసరం నేడు ప్రపంచానికి ఉంది” అన్నారు.
“ఇలాంటి మహిళలు, పురుషులు మీలో ఎవరైనా ఉన్నారా?” అని స్వామీజీ అడిగారు. మార్గరెట్ “నేను సిద్ధం” అని అన్నది. స్వామీజీ “ప్రపంచాన్ని మార్చేందుకు నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి. అప్పుడు నీతో పాటు మరికొందరు వస్తారు. నీ ఆత్మను మేల్కొలుపు” అని అన్నారు.
తమ దేశానికి చాలా దూరంలో ఉన్న భారత్ కి వెళ్లి సేవ చేయడానికి ఆమె సిద్ధపడింది. కానీ అందుకు తనను తాను సిద్ధం చేసుకోవడం అంత సులువైన పని కాదు కదా? స్వామీజీ భారతదేశ చిత్రపటాన్ని ఆమె ముందు పెట్టారు.

స్వామి వివేకానంద విదేశీ శిష్యురాండ్రలో ఒకరిగా సోదరి నివేదిత (స్వామికి ఎడమ వైపు )
పేదరికం, అంటరానితనం, ద్వేషం తదితర చెడు లక్షణాలతో నిండి ఉన్న భారతదేశాన్ని ఆమె కళ్ళతో చూడమని స్వామీజీ సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్న ఆంగ్లేయులకు ఆమె పట్ల గౌరవం ఉండదని, భారతీయులు సందేహ దృష్టితో, ద్వేషంతో చూస్తారని స్వామీజీ ఆమెకు చెప్పారు. తన సాటి వారిని కూడా అంటరాని వాళ్ళుగా పరిగణించే విధంగా తమ దేశ ప్రజలు ఉన్నారని స్వామీజీ ఆమెకు తెలిపారు. అటువంటి దేశ మహిళలకు చదువు చెప్పేందుకు, వారికి సేవ చేసేందుకు మార్గరెట్ సిద్ధమైంది.
1989లో ఒక చిన్న గుడిసెను అద్దెకు తీసుకుని నివేదిత ఒక పాఠశాలను ప్రారంభించింది. తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఆమె అనతికాలంలోనే ప్రసిద్ధి పొందింది. ఉత్తర కలకత్తాలో ఆమె “ సిస్టర్ నివేదిత” గా ప్రాచుర్యం పొందింది.
స్వామీజీ ఒకసారి నివేదితకు ప్రేరణ దాయకమైన సందేశాన్ని ఇస్తూ “చివరి క్షణం వరకు ప్రార్థన చేస్తూ ఉండు. అందాన్ని ఎలా అయితే పూజిస్తామో – అంద వికారాన్ని కూడా అలాగే పూజించు” అని అన్నారు. గురువు ఇచ్చిన సందేశాన్ని ఆమె మనసులో నింపుకుంది. చావు అనివార్యం అని తెలుసుకుంది. అది జీవితానికి ఉన్న రెండవ పార్శ్వమని తెలుసుకుంది. ఈ కొత్త పని, అనుభూతి ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

శారదామాత సన్నిధిలో…
1899లో కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఆ మహమ్మారి ప్రతిరోజూ లక్షలాదిమంది ప్రాణాలను హరిస్తూ పోయింది. ఆ సమయంలో నివేదిత రోగుల సేవలో నిమగ్నమైంది. ఆమె మురికివాడలను, మూత్ర శాలలను శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల ప్రభావం వల్ల మిగిలిన మహిళలు కూడా ఆమెకు సహాయం చేయ సాగారు. నివేదిత రాత్రి, పగలు తేడా లేకుండా పని చేసింది. తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆమె ఎంతో మంది రోగులకు ప్రాణ దానం చేసింది. ఈ సమయంలో ఆమె కేవలం పాలు, పళ్ళని ఆహారంగా తీసుకునేది. ఒక రోజున ఒక రోగికి మందులు కొనడం కోసం తాను తాగే పాలను కూడా ఆమె త్యాగం చేసి ఆ డబ్బులతో మందులు కొన్నది.
నిధుల కొరత కారణంగా నివేదిత పాఠశాల నడపడం కష్టమైంది. పాఠశాలను నిర్వహించాలంటే పశ్చిమ దేశాల నుండి ఆర్థిక సాయం తీసుకోవాలని ఆలోచించింది. ఆమె యూరప్ కు ప్రయాణమైంది. యూరప్ నుండి అమెరికాకు వెళ్ళింది. కొన్ని క్రైస్తవ మిషనరీలు భారతదేశం గురించి, ఇక్కడి విభిన్న ధర్మాల గురించి అమెరికాలో అసత్యాలను, లేనిపోని మాటలను ప్రచారం చేసి ఉన్నాయి. అందువల్ల అక్కడి వ్యక్తులకు భారతదేశం గురించి ఇక్కడి మహోన్నత సంస్కృతి గురించి తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నదని నివేదిత కు అనిపించింది. అమెరికా ప్రజల్లో భారత దేశం పట్ల సరైన అవగాహన కలిగించేందుకు నివేదిత తన గురువు లాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళింది. భారతదేశపు ప్రాచీన గౌరవ సంస్కృతిని గురించి వారికి తెలియజేసింది. భారతదేశపు చరిత్ర, ధర్మం, సభ్యత, సంస్కృతి గురించి ఆమెకు చక్కటి అవగాహన ఉంది. తన ఉపన్యాసాల ద్వారా అమెరికా వాసుల మనసుల్లో భారతదేశం గురించి ఆకర్షణీయమైన చిత్రాన్ని ఆమె ముద్రించింది. చాలాకాలం విదేశీయుల పరిపాలనలో ఉన్నకారణంగా భారతదేశం ఈ దుర్దశలో ఉందన్న విషయాన్ని అమెరికా వాసులకు వివరించడంలో నివేదిత సఫలురాలయింది. కానీ తన పాఠశాల, ఇతర కార్యక్రమాల కోసం జనాన్ని పోగు చేసే విషయం మాత్రం అనుకున్నంత సఫలం కాలేదు.
1901లో నివేదిత భారతదేశానికి తిరిగి వచ్చింది. నివేదిత స్కూలు మళ్లీ నడవడం మొదలైంది. ఇప్పుడు పాఠశాలకు కేవలం బాలికలే కాకుండా వాళ్ల తల్లులు కూడా శిక్షణ పొందడానికి రాసాగారు.
భారతదేశ స్వాతంత్రం కోసం సంఘర్షణ చేయాలనే మరో మహాకార్యాన్ని నివేదితకు స్వామి వివేకానంద తన మరణానికి ముందు అప్పజెప్పారు. దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఆమె మీద పడింది. భారత స్వాతంత్ర్య సాధనను జీవన కార్యంగా ఆమె స్వీకరించింది. తెల్ల వాళ్ళ మధ్య పుట్టి పెరిగిన విదేశీ స్త్రీ వాళ్లకు విరుద్ధంగా తన ఆలోచనలతోనూ, మాటలతోనూ, చేతలతోనూ యుద్ధం చేయడానికి సిద్ధపడింది. ఆమె భారతదేశాన్ని తన మాతృభూమి గా భావించింది.

నివేదిత పేరు తెలియని ఇల్లు ఇవాళ బెంగాల్లో ఒక్కటి కూడా లేదు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామం కోసం ప్రజలను సమాయత్తం చేయడానికి ఆమె పర్యటన ప్రారంభించింది. ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించింది. నివేదిత తన పాఠశాలను జాతీయతకు కేంద్రంగా మార్చింది. ప్రజలను మానసిక బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. నివేదిత భారతీయులలో జాతీయతను జాగృతం చేయడానికి అనేక పుస్తకాలను రచించింది. వాటి ద్వారా వేదాలు, పురాణాల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పింది. నివేదిత ఎప్పుడూ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉండేది. ఆమె ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తుండేది. విశ్రాంతి అంటే ఏమిటో ఆమెకు తెలియదు.
1905లో ఆరోగ్యం పూర్తిగా పాడైపోయాక నివేదిత తన అంతిమ కోర్కెను తెలియజేసింది. ఆమె తన దగ్గర ఉన్న సంపద, నగదు మొదలైన వాటిని బేలూరు మఠానికి సమర్పించింది. అంతేకాకుండా తన రచనలకు సంబంధించిన కాపీరైట్ ద్వారా వచ్చే ధనాన్ని కూడా మఠానికి సమర్పించాలని తెలియజేసింది. ఆ నిధితో భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవ్వాలన్నది ఆమె కోరిక. “ నాకు ఉజ్వల భవిష్యత్తు తాలూకు వెలుగు కనిపిస్తోంది” అని అంది. అవే సోదరి నివేదిత ఆఖరి మాటలు.
సర్ జగదీష్ చంద్ర బోస్, సోదరి నివేదిత జ్ఞాపకార్ధంగా ప్రసిద్ధ వైజ్ఞానిక శాలను స్థాపించారు. జ్యోతిర్మయి నివేదిత ప్రతిరూపంగా అక్కడ ఆయన కాగడా పట్టుకున్న ఓ మహిళ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయబడింది. ఆ సమాధి మీద “భారత దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ దీర్ఘ నిద్రలో ఉంది” అని వ్రాయబడింది.
ఆ రోజున సోదరి నివేదిత ప్రారంభించిన చిన్న పాఠశాల నేడు పెద్ద సంస్థగా అవతరించింది. అక్కడ, వేలాది మంది భారతీయ యువకులు, మహిళలు జాతీయ వాదం గురించి శిక్షణ పొందుతున్నారు.
తన సేవా వ్రత సాధనకై అహరహమూ శ్రమించిన సోదరి నివేదిత జయంతి నేడు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





