News

అయోధ్య కేసులో హిందూ వర్గాల వినతికి సానుకూలంగా స్పందించిన సుప్రీం

933views

కొన్ని దశాబ్దాలుగా నానుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమయ్యే దిశగా సాగుతోంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి అటు రామజన్మ స్థానం లేదా ఇటు బాబ్రీ మసీదుకు చెందినది కాదని ఒకవేళ సుప్రీంకోర్టు భావిస్తే, సదరు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించాలని హిందూ వర్గాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తటస్థ నిర్ణయం తీసుకుంటే, వివాదాస్పద భూమి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించాలని కోరుతూ హిందూవాదులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై లిఖితపూర్వక నోట్‌ను దాఖలు చేయడానికి అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు 1961లో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదిగా ఉమేష్ చంద్ర పాండేను పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్ తదితరులతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పటి పిటిషన్‌ను ఉదహరించింది. 40 రోజులపాటు ప్రతిరోజూ ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇలావుంటే, ఒకవేళ వివాదాస్పద భూమి ఎవరికీ చెందదని కోర్టు భావిస్తే దానిని తక్షణమే ప్రభుత్వ భూమిగా ప్రకటించాలని హిందూ వర్గాలు కోరాయి. ఈ ప్రకటన కోసం వేసిన పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు లిఖితపూర్వకంగా నోట్‌ను అందజేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయోధ్య కేసు ఇప్పటికే పూర్తయినట్టు భావిస్తున్నామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, తీర్పు తర్వాత ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిందూ వర్గాలు వేసిన పిటిషన్‌ను ఆమోదించినట్టు పేర్కొంది. 1856లో అప్పటి నవాబును పదవీచ్యుతుడిని చేసిన లార్డ్ డల్హౌసీ అయోధ్య ప్రాంతంపై ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేయలేదు. అయితే, 1858 మార్చి 3న సదరు భూమి బ్రిటీష్ ప్రభుత్వానికి చెందుతుందని లార్డ్ కానింగ్ ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వానికి చెందిందే అని స్పష్టమవుతుందని హిందూ వర్గాలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటినుంచి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సదరు భూమి ఎవరికి చెందిందనేది వివాదాస్పదంగా కొనసాగింది. వివిధ దశల్లో కొనసాగిన ఈ కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. దశాబ్దాలుగా ఎలాంటి నిర్ణయం వెలువడని కారణంగా అయోధ్య కేసు స్పష్టత లేని ఓ అంశంగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం పదే పదే వాయిదాలు లేకుండా ఏకబిగిన 40 రోజులపాటు విచారణను, వాదలను పూర్తిచేసింది. చివరకు తీర్పు రిజర్వు చేసింది. కోర్టు నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా హిందూ వర్గాల రిటన్ నోట్ దాఖలు చేసే అవకాశం కల్పించడంతో ఈ తీర్పు ఏ రూపంలో ఉండబోతుందనే విషయంపై కోర్టు సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.

 

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.