News

బెంగళూరులో ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

457views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మూడు రోజుల పాటు బెంగళూరులోని జనసేవా విద్యా కేంద్రంలో జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 23 వ తేదీ వరకూ ఈ సభలు జరుగుతాయి. ఈ విషయాన్ని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

సంఘ వ్యవస్థలో ఇలా ఈ సమావేశాలు ప్రతి యేడాది జరుగుతూనే వుంటాయి. గత యేడాది వార్షిక నివేదిక (కార్యవృత్త)పై బైఠక్ లో చర్చ జరుగుతుంది. ఆ రిపోర్టు, నిర్ణయాలపై విమర్శనాత్మక విశ్లేషణతో పాటు ప్రత్యేక కార్యక్రమాలపై ఓ నివేదిక కూడా సమర్పిస్తారు.

రాబోయే విజయ దశమి నాటికి సంఘ్ నూరు సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ఈ సంవత్సరం విజయ దశమి నుంచి వచ్చే సంవత్సరం విజయ దశమి వరకూ వున్న కాలాన్ని సంఘ శతాబ్ది సంవత్సరంగా నామకరణం చేశారు. శతాబ్ది సంవత్సరం పురోగతిని సమీక్షిచడంతో పాటు, రాబోయే సంవత్సరానికి సంబంధించి వివిధ కార్యక్రమాల రూపకల్పన ఈ సమావేశాల్లో చేయనున్నారు.

అలాగే జాతీయ సమస్యలపై రెండు తీర్మానాలను ఆమోదించే విషయం కూడా ఈ సమావేశాల్లో పరిశీలించనున్నారు. వీటితో పాటు సంఘ శాఖల పరిస్థితి, పంచపరివర్తన్ పురోగతి, ప్రయత్నాలను కూడా చర్చిస్తారు.వీటితో పాటు హిందువుల పరిస్థితి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ, కార్యకలాపాలు కూడా చర్చకు రానున్నాయి.

ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభల్లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఇతర సహ సర్ కార్యవాహలు, కార్యనిర్వాహకల సభ్యులు పాల్గొంటారు. మొత్తం 1500 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.