
విద్యా భారతి కేవలం విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, మానవాళికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం వుందన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో విద్యాభారతి నిర్వహిస్తున్న ఐదు రోజుల కార్యశాల ఉద్ఘాటన కార్యక్రమంలో మోహన్ భాగవత్ మార్గనిర్దేశనం చేశారు. విద్యా భారతి తమ సైద్ధాంతిక భూమిక ప్రకారం విద్యా బోధను చేస్తోందని, విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవితాల్లో విలవలు కూడా నింపుతోందన్నారు. సమాజంలో పరివర్తన రావాలంటే మొట్ట మొదట వ్యక్తిలో పరివర్తన రావాలన్నారు. ఈ దిశగా విద్యాభారతి పాత్ర ఎంతో కీలమైందని, వ్యక్తి నిర్మాణం, వ్యక్తి స్వభావాన్ని నిర్మించేందుకు దోహదపడే ఇలాంటి విద్యా వ్యవస్థను అందరమూ మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విశాల దృక్పథంతో చూడాలని, మానవాళికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడాలన్నారు. తాము చేస్తున్న పనిని సమాజంలోని ప్రతి వర్గం దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుందని నొక్కి చెప్పారు. ప్రపంచానికి మార్పు అనే గుణం సహజంగానే వుందని, అందుకే మార్పు అవసరం అని అన్నారు. అయితే.. మార్పు ఏ దిశలో ఎలా జరగాలన్నదే చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ మార్పు సానుకూలంగా వుండేలా చూసుకోవాలన్నారు.
మన విద్యా విధానం చాలా విశాలమైనదని, కేవలం జ్ఞానాన్ని అందించడానికే పరిమితం కాకూడదని, సమాజాన్ని నైతికంగా పరిపుష్టం చేయడమే దీని లక్ష్యమని అన్నారు. నేటి కాలంలో సాంకేతికత అనేది సమాజంలోని ప్రతి రంగంపై తన ప్రభావాన్ని చూపుతోందని, అందుకే టెక్నాలజీ విషయంలో ఓ మానవీయ విధానాన్ని రూపొందించుకోవాలని సూచించారు. ఈ సాంకేతికతలో ఏదైనా చెడు అంశం వుంటే అక్కడే, అప్పుడే వదిలేయాలని, మంచి అనేది ఏదైనా వుంటే స్వీకరించి, ముందుకు సాగాలన్నారు.
ఇక.. భారత దేశ సాంస్కృతిక ప్రత్యేకతను చాటి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగించాలని మోహన్ భాగవత్ సూచించారు. భారత సంస్కృతి ప్రతి ఒక్కర్నీ అనుసంధానం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తోందని, దానిని ముందుకు తీసుకెళ్లడం, నిర్వహించడం అందరి కర్తవ్యం అని ఉద్బోధించారు.
అదేవిధంగా అందరిలో వున్న ఆత్మ వస్తువు గురించి కూడా విశదీకరించి చెప్పారు. ‘‘నేను అందరిలో వున్నాను. అందరూ నాలో వున్నారు. ప్రతి వ్యక్తి తాను సమాజంలో అంతర్భాగమని అనుకోవాలి. అలాగే సమాజం కూడా దానిలో భాగమే అని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ తత్వశాస్త్ర ప్రాథమిక ఆలోచన. ఈ ధృక్కోణం నుంచే మన చర్యలు వుండాలి’’ అని సరసంఘచాలక్ పేర్కొన్నారు.
నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని భాగవత్ పునరుద్ఘాటించారు. భారత్ ఎల్లప్పుడూ సత్య మార్గాన్ని అనుసరించడం ద్వారా తన విలువల ఆధారంగా ప్రయాణం చేస్తోందని, నేటికీ అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని శ్లాఘించారు. సమాజంలో పరివర్తన రావాలంటే మొట్ట మొదట వ్యక్తిలో పరివర్తన రావాలన్నారు. ఈ దిశగా విద్యాభారతి పాత్ర ఎంతో కీలమైందని, వ్యక్తి నిర్మాణం, వ్యక్తి స్వభావాన్ని నిర్మించేందుకు దోహదపడే ఇలాంటి విద్యా వ్యవస్థను అందరమూ మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ప్రయత్నాలు కేవలం ఓ వర్గం లేదా సమూహ సంక్షేమానికి మాత్రమే పరిమితం కావొద్దని, యావత్ సమాజ సంక్షేమమే లక్ష్యంగా వుండాలని సూచించారు.
మన శక్తి, మన వనరులు, మన తెలివితేటలు కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసమే కాకుండా, యావత్ సమాజ పురోభివృద్ధికి అంకితం కావాలని అన్నారు. మన సమాజంలో ఎన్నో భావజాలాలు వున్నాయని, వారందర్నీ మనతో కలిపి తీసుకెళ్లాలని, మనతో ఏకీభవించని వారిని కూడా కలుపుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు. అభిప్రాయాలు భిన్నంగా వుండొచ్చని, అయితే కార్యాచరణ మాత్రం సరైన దిశలో వుండాలన్నారు. సానుకూల ఆలోచనలు, సృజనాత్మకత అన్న ఆలోచనల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.
ఈ ఉద్ఘాటనా కార్యక్రమంలో విద్యాభారతి అఖిల భారతీయ అధ్యక్షులు దూసి రామకృష్ణారావు తొలి పలుకులు మాట్లాడారు. ఇలాంటి కార్యశాలల ద్వారా విద్యాభారతి కార్యకర్తలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. తద్వారా విద్య అన్న మాధ్యమంగా సమాజంలో మంచి మార్పులు తీసుకురావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం 2020లోని అన్ని అంశాలను గౌరవిస్తూ, సంస్థ యొక్క లక్ష్యాలకు కొన్ని కొత్త అంశాలను జోడించే నిబంధన కూడా రూపొందించబడిందని ఆయన చెప్పారు.





