
బెంతు ఒరియాల ఆరాధ్య దైవం బోడో దేవత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఆముదాలపుట్టుగలోని బోడో అమ్మవారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పెద్దఆముదాలపుట్టుగ, కొక్కిలిపుట్టుగ, నాథపుట్టుగ, చిన్న ఆముదాలపుట్టుగ గ్రామస్థులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు 18 పుట్టుగ గ్రామాలకు చెందిన భక్తులతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
70 ఏళ్ల నుంచి..
సుమారు 70 ఏళ్ల నుంచి బోడో దేవత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా మహా శివరాత్రి తరువాత వచ్చే మొదటి గురువారం బోడో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో ఉన్న మట్టి పుట్టనే అమ్మవారిగా కొలుస్తారు. అమ్మవారికి భక్తులు పాయసం, నెయ్యిలు, కోడిగుడ్లను నైవేద్యంగా పెడతారు. భక్తులు సమర్పించే నైవేద్యాల్లో స్వయంపాకం ప్రత్యేకమైనది. బియ్యంలో సోలడు కందిపప్పు, బెల్లం కలిపి మట్టి కలశంలో గుడి ప్రాంగణంలోనే వండుతారు. ఈ ప్రసాదాన్ని భక్తితో అమ్మవారికి సమర్పిస్తారు. మొదటి నాలుగు రోజులపాటు అమ్మవారికి వివిధ పూజలు నిర్వహిస్తారు. ఐదో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు. 70 సంవత్సరాలపాటు పెద్ద ఆముదాలపుట్టుగలోని పురాతన మందిరంలోనే అమ్మవారు పూజలు అందుకున్నారు. ఈ ఏడాది నూతన ఆలయాన్ని నిర్మించి అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమాలను సైతం చేపడుతున్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన బెంతు ఒరియా కులస్థులంతా ఈ ఉత్సవాల కోసం తప్పకుండా స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాలనే జామి జాతరగా స్థానికంగా పిలుస్తారు. ఇక్కడ జాతర జరిగిన తరువాత మృగశిరా నక్షత్రం సమయంలో సోంపేటలో జామి జాతర జరుగుతుంది. అనంతరం మండలంలోని జాడుపుడి, మజ్జిపట్టుగ, కవిటి, పలాస గ్రామాల్లో జామి ఎల్లమ్మ జాతర్లు జరుగుతాయి.
వందలాది కుటుంబాలకు ఉపాధి
ప్రతి ఏటా నిర్వహించే బోడో దేవత ఉత్సవాల సందర్భంగా వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడ దుకాణాలను ఏర్పాటు చేస్తారు. పిన్నిసు నుంచి ఎలక్ట్రిక్ బొమ్మలు, నిత్యావసరాల వస్తువులు, గృహోపకరణాలు, చేనేత వస్తువులు, మట్టి కుండలు, ఇతర సామగ్రి అమ్మే వందలాది దుకాణాలు తెరుచుకుంటాయి. వీటి వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే, ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒరియా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఒడిశా రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తుంటారు. వీటిని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.





