
బంగ్లా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లలో భారత జవాన్ మృతిచెందడంపై వివరణ ఇవ్వాలని బంగ్లాదేశ్ హోంమంత్రి ఆ దేశ సరిహద్దు దళాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఫోన్ ద్వారా వెల్లడించారు. భారత్, బంగ్లా సరిహద్దుల్లో గురువారం బంగ్లా దళాలు కాల్పులు జరపగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ స్పందిస్తూ.. ఈ ఘటనపై నాకు కొద్దిసేపటి క్రితం సమాచారం అందింది. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే విషయంపై సమగ్రంగా వివరణ ఇవ్వాలని సరిహద్దు దళ డైరెక్టర్ జనరల్ షఫీనుల్ ఇస్లాంను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై శుక్రవారం బంగ్లా రాజధాని ఢాకాలో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గత దశాబ్ద కాలంగా భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉందని మరోసారి గుర్తు చేశారు.
బంగ్లా సరిహద్దు దళాలు జరిపిన కాల్పుల్లో గురువారం బీఎస్‌ఎఫ్ జవాన్ విజయ్‌భాన్ సింగ్ అనే జవాన్ మృతి చెందగా, మరో జవాన్ గాయాల పాలైన విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దాదాపు 4వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు ప్రాంతం ఉంది. అందులో అధిక భాగం పశ్చిమ బెంగాల్‌లో ఉంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





