
దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్న అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వాదనలు విన్నది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం విషయంపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన విషయం తెలిసిందే. వాదనల చివరి రోజు సర్వోన్నత న్యాయస్థానంలో హైడ్రామా చోటుచేసుకుంది. విచారణలో భాగంగా హిందూ మహాసభ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకాన్ని కోర్టు ముందు ఉంచగా.. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించివేస్తామని హెచ్చరించారు. అయినా వికాస్ సింగ్ తన వాదనలు విన్పిస్తుండగా.. రాజీవ్ ధావన్ జోక్యం చేసుకొని ఆ పుస్తకాన్ని చించివేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గగొయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
2010లో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణలో భాగంగా అయోధ్యకు సంబంధించిన అంశం సున్నితమైందనీ.. మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా పరిష్కార మార్గాన్ని కనుక్కోవచ్చన్న అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటుచేసింది. అయితే, ఆ కమిటీ పరిష్కార మార్గాలు కనుగొనలేకపోగా.. కొంత విఫలమైనందున సుప్రీంకోర్టే రోజువారీ విచారణ చేపడుతుందని జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు. దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడ, రాంలాల్ విరాజ్‌మని, సున్నీ వక్ఫ్ బోర్డు ఈ మూడుపక్షాలకు అలహాబాద్ హైకోర్టు సమానంగా పంచుతూ గతంలో తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇక తీర్పే తరువాయి
రాజ్యాంగ ధర్మాసనంలో నిర్మోహి అఖాడ తరఫున సుశీల్ కుమార్ జైన్ వాదనలు విన్పించారు. నిర్మోహి వంశస్థులకు తరతరాలుగా ఈ భూమి స్థలం కేటాయిస్తూ వస్తున్నారనీ.. వారి ఆధీనంలోనే ఈ భూమి ఉన్నందున వారికే కేటాయించాలని వాదించారు. రాంలాలా తరఫున సీఎస్ వైద్యనాథన్, పరాశరన్ తమ వాదనలు విన్పించారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇదొక రామజన్మభూమిగా కొనసాగుతోందని భక్తులంతా ఎన్నో ఏళ్లుగా విశ్వసిస్తున్నారనీ.. రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని కోర్టుకు విన్పించారు. అనంతరం ముస్లిం పక్షాల తరఫున రాజీవ్ ధావన్ వాదనలు విన్పించారు. బాబర్ వచ్చి మసీదును నిర్మించాక ముస్లింలు రోజూ అక్కడికి వెళ్లి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేవారని వాదించారు. ఈ పిటిషన్లతో పాటు పలువురు వ్యక్తిగత, హిందూ మహాసభ , వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. వీరందరికీ రాజ్యాంగ ధర్మాసనం తగిన సమయం కేటాయిస్తూ వచ్చింది . ఈ రోజు సాయంత్రం వరకు జరిగిన వాదనలకు సంబంధించి కక్షిదారులు ప్రతివాదనలు విన్పించేందుకు ఈ రోజు ఒక్కో వర్గానికి 45 నిమిషాల తరఫున సమయం కేటాయించారు. ముందుగానే వాదనలు ముగియడంతో 4 గంటలకే ఈ కేసు విచారణ పూర్తయినట్టు జస్టిస్ రంజన్‌గగొయ్ ప్రకటించారు. అనంతరం ఈ తీర్పును రిజర్వు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్లు ఏమైనా చెప్పాలనుకుంటే మూడు రోజుల్లో రాతపూర్వకంగా సమర్పించేందుకు గడువు ఇస్తున్నట్టు తెలిపారు. వాదనలు పూర్తవ్వడంతో ఇక తీర్పే తరువాయి.
అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసు ఇదే!
సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన కేసుల్లో ఇది రెండోది. 1972లో ప్రాథమిక హక్కులపై దాఖలైన కేశవానంద భారతి అనే కేసు మొదటిది. దాదాపు 68 రోజుల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం 1972లో ఈ కేసును విచారించింది. అలాగే, ఇటీవల ఆధార్‌పై దాఖలైన పిటిషన్‌పై 38 రోజుల పాటు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న ఆధార్ కేసును దాటి అయోధ్య కేసు 40 రోజుల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది.
తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు ఎలా వెలువడుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అందుకనుగుణంగా అయోధ్యలో 144 సెక్షన్ విధించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Source : Enadu.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





