
చంద్రయాన్-3 మిషన్‌తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ మిషన్ చంద్రుడిపై నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే..అందులో అమర్చిన పరికరాలు అందిస్తున్న సమాచారంతో ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణల దిశగా ముందడుగు వేస్తున్నారు.
ఈ మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ PRL బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ ప్రాంతం దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించడం గమనార్హం. దీనికి సంబంధించిన అధ్యయనం ‘సైన్స్ డైరెక్ట్’లో పబ్లిష్ అయ్యింది.
భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ఆ బృందం పేర్కొంది. ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక, తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది.
చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, 2023లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది.
ఇక భారత్ ప్రస్తుతం చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు. అందులో భాగంగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండుసార్లు ప్రయోగించి.. చంద్రయాన్-4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు. వాటిని కక్ష్యలోనే బిగిస్తామని చెప్పారు.





