
ప్రయాగరాజ్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని నెలకొల్ప డానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నడుం బిగించింది. ప్లాస్టిక్ సంచులు, ప్లేట్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు వాడాలని కుంభమేళా సందర్శకులకు పిలుపునిచ్చింది. ఒక సంచీ-ఒక కంచం నినాదాన్ని భక్త జన సందోహం లోకి తీసుకొని వెళ్లింది. కేవలం పిలుపునివ్వడంతో, నినాదాన్ని తీసుకొని వెళ్లడంతో సరిపుచ్చక వాటిని స్వయంగా పంచడానికి ఆర్ఎస్ఎస్ ఉపక్రమించింది. ఇప్పటికే దాదాపు 70,000 గుడ్డ సంచులను భక్తులకు, సందర్శకులకు పంచిపెట్టినట్టు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహ-సర్ కార్యవాహ కృష్ణ గోపాల్ తెలిపారు. అంతేకాకుండా కుంభమేళాలో పంచడం కోసమని దేశం నలుమూలాల నుంచి 20 లక్షల స్టీలు కంచాలు, లోటాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. అలా సేకరించినవాటిని అన్ని లంగర్లు, ఆహార కేంద్రాల వద్ద పంచిపెడతామని తెలిపారు. తద్వారా పవిత్ర ప్రయాగరాజ్లో ప్లాస్టిక్, థర్మోకోల్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిలుపదల చేయడానికి తాము సంకల్పించినట్టు ఆయన చెప్పారు.





