
గత 350 సంవత్సరాలుగా యూరోపియన్ల క్రూరత్వం నుండి ఆఫ్రికాను కాపాడటానికి ఏమీ చేయని జీసస్…
అవినీతిపరులైన రాజకీయ నాయకులు, దురాశాపరులైన యూరోపియన్లు తమకు చేసిన గాయాల నుండి యేసు క్రీస్తు తమకు ఉపశమనం కలిగిస్తాడని ఆఫ్రికాలోని క్రైస్తవులు భావిస్తారు. ఆఫ్రికాలోని ఏ మూలకి వెళ్లినా రోదిస్తూ, మోకాళ్ళ మీద నిలబడి తమ రక్షకుడు త్వరగా రావాలని ప్రార్ధిస్తున్న ప్రజలు కనిపిస్తారు.
ఆఫ్రికా మళ్ళీ తన సమగ్రతను నిలబెట్టుకోవడానికి యేసు పవిత్ర రక్తం చాల అవసరమనే సువార్త రోజు రోజుకీ బాగా వ్యాప్తి చెందుతోంది.
ప్రజలను తమ కష్టాల నుండి కాపాడతానని హామీ ఇచ్చిన శ్వేత జాతి యేసు ఇప్పుడు ఆఫ్రికన్ల ప్రార్ధనలు వినడం లేదా లేక వాళ్ళని పట్టించుకోవడం పూర్తిగా మానేశాడా? అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఈ ఆఫ్రికన్లు ఎప్పుడు మేలుకొని, తాము అబద్దపు మాటలకు మోసపోయాము అన్న సత్యాన్ని గ్రహిస్తారా? అనేది మరొక ఆశ్చర్యార్ధక ప్రశ్న. యేసు అనే వ్యక్తి చరిత్రలో ఉండి ఉండచ్చు. కానీ అతను ఆఫ్రికన్లను ఈ దుష్ట ప్రపంచం బారి నుండి కాపాడటానికి వస్తాడనేది మాత్రం నమ్మడానికి వీలు లేని వాస్తవం. అతను ఇప్పుడే కాదు మరెప్పుడూ కూడా రాడు.
ఈ రోజున ఆఫ్రికా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాల్సింది ఆఫ్రికన్లే. ‘యేసు హామీ’ ని కలిగియున్న మతాన్ని ఆఫ్రికాకి తెచ్చిన యూరోపియన్లు, తమ సమస్యలను పరిష్కరించడం కోసం కుటిల పన్నాగాలను పన్నుతున్నారు. వాళ్ళేమీ మోకాళ్ళ మీద కూచుని తమ కష్టాలను తీర్చమని యేసుకి ప్రార్ధనలు చేయడం లేదు. అందుకు భిన్నంగా వాళ్ళు ఇతర దేశాల మీద దాడి చేసి ఆక్రమించి, అక్కడ ఉన్న వనరులను బలవంతంగానో, మాయమాటలు చెప్పో దోచుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయం లో వాళ్ళు యేసు సువార్తను ఆఫ్రికాలో వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియమైన ఆఫ్రికన్లకు ఒక ప్రశ్న…యూరప్ లో ఎన్ని చర్చీలు ఈ రోజున భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి? మీ దేశానికి యేసుని తీసుకొచ్చిన యూరోపియన్లు ఇంకా ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఎందుకు ఇప్పుడు క్రైస్తవాన్ని దూరంగా పెట్టి, అన్ని రకాలైన అనైతిక కార్యాలకు చట్టబద్ధత కలిగిస్తున్నారు? ఈ అంశాన్ని ఆఫ్రికన్లు అందరూ పరిశీలించి, ఆలోచించాలి.
దయ చేసి వాళ్ళు నరకానికి పోతారని, వాళ్ళ అబద్ధాలు నమ్మిన మీరు స్వర్గానికి పోతారని భ్రమ పడమాకండి. ఎందుకంటే…స్వర్గం, నరకం అనేవి ఏవీ లేవు. మనం పునర్జన్మని నమ్ముతాము, మన ప్రయాణం అటు వైపే ఉండాలి. ఆఫ్రికన్లు స్వర్గానికి పోవాలి అనుకుంటే, ప్రపంచం లోని మిగిలిన జాతుల వాళ్ళు చేస్తున్నట్టుగా స్వర్గాన్ని ఇక్కడే నిర్మించుకోవాలి.
చాలా మోసపూరితమైన సువార్తతో మనలని ఇక్కడ వెనక్కి లాగుతున్నారు. నిన్ను ఎవరన్నా ఒక చెంప మీద కొడితే, నీవు రెండవ చెంప చూపుము అనే సువార్త మరియు వానిటీ సువార్త ఆఫ్రికన్లను అభివృద్ధి చెందనీయకుండా చేశాయి. ఇక్కడకి వచ్చిన మత ప్రచారకులు మనల్ని ఎవరన్నా బాధ పెడితే, మనం తిరిగి వాళ్ళని బాధ పెట్టకుండా ఆ బాధలను సహించాలి అని పదే పదే నూరిపోశారు. అయితే వాటికన్ కానీ, ఇజ్రాయేలు కానీ శత్రువులు తమ మీద దాడి చేసినప్పుడు ఎప్పుడూ తాము చెప్పిన దానిని ఆచరించలేదు. తమ మీద దాడి జరిగినప్పుడల్లా వాళ్ళు తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు, పోపులు, బిషప్పులు వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళు తమ మీద దాడి చేసినవారి మీద ప్రతిదాడి చేసి వాళ్లకి సమాధానం చెప్పారు.
ఈ ప్రపంచం లో సంపదను కూడబెట్టడం అతి పెద్ద పాపం అని చెప్పే వానిటీ సువార్త ఇంకా ప్రమాదకరమైనది. పేదవాళ్లుగా ఉండిపొమ్మని బోధించే సువార్తను నమ్మే జాతి ముందుకు పోగలుగుతుందా? దీనికి సమాధానం ‘కాదు’ అనే చెప్పుకోవాలి.
1885లో యూరోపియన్లు తమ దేశాన్ని వలస దేశంగా మార్చుకొన్నప్పటి నుంచి ఆఫ్రికన్లు యేసును వచ్చి తమని రక్షించమని ప్రార్ధిస్తూనే ఉన్నారు. కానీ 130 సంవత్సరాలుగా యేసు వాళ్ళ ప్రార్థనలను పట్టించుకోలేదు. ఆఫ్రికన్లను దోచుకునే యూరోపియన్లు, అమెరికన్లను ఆశీర్వదించడంలో ఆయన నిమగ్నమయిపోయాడు. మనం దీనిని ప్రశ్నించినప్పుడు కొంతమంది మూర్ఖ ఆఫ్రికన్లు ‘దేవుని సమయమే సరి అయిన సమయం’ అంటుంటారు. ఆ ఒక్క వాక్యం అనేక మంది ఆఫ్రికన్లను ఏళ్ళ తరబడి యూరోపియన్లకు విధేయులుగా మార్చేసింది.
ఉదాహరణకి నైజీరియాలోని చర్చ్ లు ఎన్నో ఏళ్ళ నుండి ప్రార్ధనలు చేస్తూనే ఉన్నాయి. కానీ అక్కడి అవినీతి, కలహాలు, మరణాలు, అసమ్మతి మొదలైనవి పెరుగుతూనే ఉన్నాయి. తమాషా ఏమిటంటే నైజీరియాలోని కాథలిక్ చర్చ్ ‘బాధల్లో ఉన్న నైజీరియా కొరకు ప్రార్ధన’ మరియు ‘నైజీరియాలోని అవినీతి, లంచాలకు వ్యతిరేకంగా ప్రార్ధన’ అనే వాటిని కూడా నిర్వహిస్తోంది.
ఆఫ్రికాలోని రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు దేశాన్ని దోచుకోకుండా యేసు ఎలా కాపాడతాడు?
అమెరికా మరియు చైనాలు తమ దేశంలోని అవినీతిని తొలగించి కాపాడమని యేసుకి ఎందుకు ప్రార్ధనలు చేయడం లేదు? ఆ దేశాల్లోని నాయకులను అదుపులో ఉంచడం కోసం ఉద్దేశించి కొన్ని వ్యవస్థలను ఆ దేశాలు ఎందుకు నిర్వహిస్తున్నాయి? వేలాది చర్చిలు ఉన్న నైజీరియకన్నా క్రైస్తవాన్ని అనుసరించని చైనా ఎలా వృద్ధి చెందుతోంది?
ఈ రోజున ఆఫ్రికా ఎదుర్కుంటున్న ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు ఇక్కడి సాంప్రదాయ మతాలు మరియు నిబద్ధతతో కూడిన ప్రయత్నం ఉంటే పరిష్కరించలేనంత క్లిష్టమైనవి కాదు. ఆఫ్రికన్లు బద్దకస్తులుగా పుట్టించబడలేదు, ఇక్కడ బద్ధకస్తులకు స్థానం లేదు. కానీ ఇక్కడవాళ్ళు పని చేయడం మానేసి శ్వేత జాతి వాళ్ళ దేముడిని నమ్మి, అతని కోసం ప్రార్ధనలు చేయడం మొదలు పెట్టారు.
‘పరలోక సహాయం’ అనే సువార్తను (మన్నా సువార్త) నమ్మిన అనేక మంది ఆఫ్రికన్లు పని దినాలలో పనికి పోకుండా ప్రార్ధనలు చేస్తూ చర్చిలలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ ఏ పనీ చేయకుండా కేవలం ప్రార్ధనలు చేస్తుంటే వాళ్లకి పరలోక సాయం ఎలా అందుతుంది?
ప్రియమైన ఆఫ్రికన్ల లారా , మీ భవిష్యత్తుకు మీరే బాధ్యత వహించండి. మన పూర్వీకుల ప్రాచీన ఆరాధనా పద్ధతులను అవలంబించి, ప్రకృతితో మమేకమై మనల్ని మనం కాపాడుకుందాము. మన గడప తొక్కిన శత్రువును ఎదురించే ధైర్యం మనకి ఉండాలి. తెల్ల వాడిని , వాడి నిరంతర దోపిడీని మనం ప్రతిఘటించాలి. మనల్ని కాపాడుకోవడానికి సరిపోయే మానవ, ప్రకృతి వనరులు మనకి ఉన్నాయి. కాకపోతే మన కృషి యేసు కోసమో, మరే ఇతర యూరోపియన్ దేవుడి కోసమో కాకుండా మన కోసం అయి ఉండాలి.
Source : Liberty writers Africa.
తెలుగు అనువాదం : శేషశాయి దీవి





