News

కోడెదూడకు కృత్రిమ కాలు అమరిక

52views

: కోడెదూడ చెంగుచెంగున గెంతుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అలాంటిది పుట్టుకతో ఒక కాలు లేకుండా పుట్టిన కోడెదూడను చూసి ఆ రైతు ఎంతో మనోవేదన చెందాడు. ఎలాగైనా దానిని నడిపించాలని…అది గెంతుతుంటే చూడాలని ఆశించాడు. పాలకొల్లులో మూగజీవాలకు కూడా కృత్రిమ కాళ్లు అమరుస్తారని తెలిసి డాక్టర్‌ సదాశివమూర్తిని సంప్రదించాడు. ఎట్టకేలకు కోడెదూడ కు కృత్రిమ కాలు అమర్చి అది గెంతుతుంటే చూసి ముచ్చటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా కె. కొత్తపాలెం(మోపిదేవి) మండలంలోని కె. కొత్తపాలెంకు చెందిన గోపాలమిత్ర మత్తి శ్రీనివాసరావు పెరట్లో ఓ కపిల ఆవు పది మాసాల క్రితం కోడెదూడకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే దూడకు ముందు వైపు ఒక కాలు లేకపోవడంతో ఆ దూడ బాధను ప్రత్యక్షంగా చూసిన శ్రీనివాసరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని చైతన్య కృత్రిమ అవయవాల కేంద్రం అధినేత వేదాంతం సదాశివమూర్తిని సంప్రదించారు. దూడను పరిశీలించిన ఆయన సుమారు 30 గంటల పాటు ఎంతో శ్రమించి కృత్రిమ కాలు అమర్చారు. ఇప్పుడు ఆ దూడ నాలుగు కాళ్లపై చకచకా నడవడమే కాకుండా, చెంగుచెంగున గెంతుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సదాశివమూర్తి ఒక్క రూపాయి తీసుకోకపోగా, వెళ్లిన రైతుకు మూడు రోజుల పాటు భోజనం కూడా ఏర్పాటు చేసి, తిరుగు ప్రయాణంలో ఆ దూడకు ఓ కట్ట తవుడు మేత కూడా అందించి తన సేవాగుణం చాటుకున్నారు. ఆ వైద్యుడి సేవాతత్పరతను ఈ ప్రాంత రైతులు వేనోళ్ల కొనియాడుతున్నారు.