
( జనవరి 3 – సావిత్రీ బాయి ఫూలే జయంతి )
విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన నికార్సైన స్త్రీవాది, మూఢాచారాలను ధిక్కరించి తమ హక్కుల కోసం నినదించేలా మహిళలకు స్ఫూర్తినిచ్చిన సంఘ సంస్కర్త, ఆకలిగొన్న వారి కడుపు నింపిన అన్నపూర్ణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ధీరవనిత…ఆవిడే సావిత్రీ బాయి ఫూలే. మహిళల సాధికారత కోసం ఒక నిశ్శబ్ద విప్లవాన్ని నడిపిన సావిత్రీ బాయి ఫూలే మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు ఖండోజి నెవెషే పాటిల్, తల్లి పేరు లక్ష్మీ. నాటి సంప్రదాయం ప్రకారం సావిత్రీ బాయి ఫూలేకు తన 9వ ఏటనే 12 ఏళ్ల జ్యోతిరావుఫూలేతో 1840లో వివాహం జరిగింది. 12 ఏళ్లకే సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న జ్యోతిరావు ఫూలే సావిత్రి బాయికి మొదటి గురువు అయ్యాడు. జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైన సావిత్రి బాయి ఆ తర్వాత తన భర్తతో కలిసి 1848లో నిమ్నవర్గాలకు చెందిన బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. 1855 నాటికి దంపతులు ఇరువురూ రాత్రి బడులను సైతం ఆరంభించారు.
1870 లో దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో 2వేలమంది బాలబాలికలకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. బాలికా విద్యతో బాటు.. మహిళా చైతన్యం కోసం సావిత్రిబాయి ఫూలే మహిళా మండళ్లను ఏర్పాటు చేయటం ఆరంభించారు. నిధుల లేమి, సిలబస్ మీద వచ్చిన అభ్యంతరాల కారణంగా 1858లో పూలే దంపతులు ప్రారంభించిన 3 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే.. ఈ దంపతుల సేవానిరతిని గుర్తించిన పలువురు వీరికి అండగా నిలవటంతో సుమారు 50 పాఠశాలలు తెరిచి అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యాబోధన చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొని నిలిచారు.
అప్పట్లో వితంతువులకు శిరోముండనం చేసేవారు. ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ.. బొంబాయి, పుణె నగరాల్లోని వేలాదిమంది క్షురకులను కూడగట్టి సమ్మెచేయించి, ‘మేం వితంతువులకు శిరోముండనం చేయం’ అని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు.. బాల వితంతువులను బడి బాట పట్టించేందుకు కృషి చేయటంతో బాటు సతీసహగమనం, అంటారానితనం, లింగవివక్ష వద్దంటూ గొప్ప ప్రచారం చేశారు. 1863లో శిశు హత్యల నివారణకు బాల్ హత్య ప్రతిబంధక్ గృహ పేరిట హోమ్‌ను ప్రారంభించారు. ఈ గృహం అనేక మందికి ఆశ్రయం ఇచ్చింది. 1873లో సత్య శోధక్ సమాజ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి స్త్రీలు, హరిజనులు, ఇతర అట్టడుగు వర్గాల ఉన్నతికి శ్రమించారు. బాల్య వివాహాలకు, సతీ సహగమనానికి, మూఢాచారాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతి పరచారు. వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు.
జ్యోతిరావు పూలే 1890 నవంబరు 28న కన్నుమూయగా ఆయన చితికి సావిత్రిబాయే స్వయంగా నిప్పంటించారు. భర్త చనిపోయిన తర్వాత కూడా సావిత్రిబాయి ఆత్మస్థైర్యంతో బాధ్యతగా సమాజ సేవకే అంకితం అయ్యారు. పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి కబళించినప్పుడు సావిత్రిబాయి తన కొడుకు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించింది. సావిత్రిబాయి ఫూలే తన 66వ ఏట 1897 మార్చి 10న ప్రజా సేవలోనే తుది శ్వాస విడిచారు.
సావిత్రిబాయి మంచి రచయిత్రి కూడా 1854లో ఆమె తన సంపుటి ‘కావ్య ఫూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభూద్ రత్నాకర్’ 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి. సావిత్రిబాయి పూలే సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది. సమాజ సేవలో పాటుపడే వారికి ప్రతి సంవత్సరము ఈ పురస్కారాన్ని అందిస్తుంది. వీరి జ్ఞాపకార్థం తపాలా బిళ్ళను కూడా విడుదల చేశారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక వైద్యురాలిని ఆమె జయంతి సందర్భంగా స్మరించుకోవడం నేటి మహిళా లోకానికే కాదు తర్వాత తరాలకూ స్ఫూర్తిదాయకం.





