తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. 1678 వైశాఖ కృష్ణ పంచమి నాడు, గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం 1621 ఏప్రిల్ 1న శ్రీ గురు తేగ్ బహదూర్ జన్మించారు. ఆయన సమయంలో భారతదేశంలోని చాలా భాగం మొగలాయిల పాలనలో ఉండేది. ఆ పరాయి పాలనను పరిసమాప్తం చేసేందుకు పూనుకున్నవారిలో గురు తేగ్ బహదూర్ కూడా ఒకరు. ఆయన వ్యక్తిత్వం సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే, ఆయన కర్తృత్వం శారీరిక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలచింది. ఆయన గురువాణి అందరి మనస్సుల్లో నిలిచిపోయింది.
`మనిషి మృత్యువుకు చాలా భయపడతాడు. ఆ భయం కారణంగానే మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. జీవితంలో విలువలు వదిలిపెడతాడు. పిరికివాడుగా మారతాడు. చనిపోయేవాడికి ఆ భయం ఉండదు. దాని గురించి చింత ఎందుకు,’ అని అంటారు గురు తేగ్ బహదూర్. ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మ మార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని గురు తేగ్ బహదూర్ భావించారు. గురు తేగ్ బహదూర్ నివసించిన ఆనందపూర్ సాహిబ్ మొగలుల అన్యాయానికి, అత్యాచారాలకు ఎదురొడ్డి నిలిచింది.
భారత్‌ను పూర్తి ఇస్లామికరణ చేయాలని ఔరంగజేబ్ భావించాడు. ఆధ్యాత్మికతకు కేంద్రమైన కాశ్మీర్‌లో అకృత్యాలు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. కాశ్మీర్ మాత్రమేకాకుండా, దేశం మొత్తంలో ఇదే పరిస్థితి ఉంది. దేశం పూర్తిగా ఇస్లామికరణ చెందకుండా నివారించాలంటే మార్గం ఏమిటి? అందుకు ఒక్కటే మార్గం. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజా చైతన్యం వల్ల మొగలాయిలు భయపడతారు. ఔరంగజేబ్ సైన్యం గురు తేగ్ బహదూర్‌తో పాటు మరో ముగ్గురిని బంధించింది. అందరినీ ఢిల్లీ తీసుకువచ్చారు. అక్కడ వారిని అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారు. ఇస్లాం స్వీకరించాలని భయపెట్టారు, బెదిరించారు. నానాయాతనలకు గురిచేశారు. మతగురువును చేస్తామని, భోగభాగ్యాలకు లోటు ఉండదని ఆశపెట్టారు. అయినా ముగ్గురు శిష్యులతోపాటు గురు తేగ్ బహదూర్ ధర్మాన్ని వదలలేదు.
ఢిల్లీ చాందిని చౌక్‌లో గురు తేగ్ బహదూర్ ఎదురుగానే ఒక శిష్యుడైన భాయి మతిదాస్ ను రంపంతో నిలువునా చీల్చారు. మరొక శిష్యుడు భాయి దియాలాను సలసల కాగే నూనెలో వేశారు. భాయి సతిదాస్‌ను పత్తిలో మూటకట్టి దానికి నిప్పు పెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి గురు తేగ్ బహదూర్ భయపడతారని వాళ్ళు అనుకున్నారు. అన్యాయం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ధర్మమని గురు తేగ్ బహదూర్ భావించారు. అందుకనే ఆయన చలించలేదు. దానితో కాజీ ఆదేశించడంతో ఒక హంతకుడు గురు తేగ్ బహదూర్ తలను నరికేశాడు. ఆయన ఈ ఆత్మబలిదానంతో దేశమంతటా ఒక చైతన్యం వచ్చింది.
పదవ గురువు గోవింద్ సింహ్ తన తండ్రి బలిదానాన్ని గురించి ఇలా అన్నారు –
తిలక్ జంజూ రాఖా ప్రభ్ తాకా | కీనో బఢో కలూ మహి సాకా |
సాధని హొతి ఇతి జిని కారీ | సీస్ దిఆ పర్ సీ నా ఉచ్రీ |
సృజన, సమరసత, మానసిక వికారాలపై విజయం సాధించడం కోసం సాధన చేయాలని గురు తేగ్ బహదూర్ ఉపదేశించారు. గురు తేగ్ బహదూర్ త్యాగం, శౌర్యం, బలిదానపు మార్గం మనకు చూపారు. మానవజాతి పరివర్తన శీలమైన నూతన శకంలో ప్రవేశిస్తున్నది. ఈ సమయంలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నేడు, అంటే డిసెంబరు 6 గురు తేగ్ బహదూర్ బలిదాన దినోత్సవం. ఈ సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి.